నన్ను గెలిపిస్తే మంత్రినై వస్తా..

Errabelli Dayakar Rao Election Campaign In Warangal - Sakshi

రాయపర్తి: నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేరాక రెండేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించానని, తనను గెలిపిస్తే మంత్రినై వస్తానని పాలకుర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని మైలారం, జగన్నాధపల్లి, సన్నూరు, ఊకల్, గట్టికల్, కొండాపురం, కొత్తూరు, పెర్కవేడు, రాగన్నగూడెం, మహబూబ్‌నగర్‌ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో కొన్ని పనులు కాకపోవచ్చు.. దానికి మీరు ఇబ్బందులు పడవద్దని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ పల్లె, ప్రతీ తండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గతంలో ఆగిన పనులన్ని పూర్తవుతాయని  చెప్పారు.

టీడీపీ హయాంలోనే కొంత పని జరిగిందని పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా తాను అభివృద్ధి చేయలేకపోయానని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు వాళ్లే ఉండడం వల్ల వారు తనకు నిధులు ఇవ్వలేదన్నారు. టీడీపీలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ప్రవేశపెట్టి పథకాలను ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌లో చేరి రెండేళ్లలో నియోజకవర్గాన్ని అద్దంలా చేశానని తెలిపారు.మంత్రి పదవిని ఇస్తానన్నా వద్దు.. ఎక్కువ నిధులు ఇవ్వమని కోరితే సీఎం కేసీఆర్‌ ఎక్కువ నిధులిచ్చారన్నారు.

కేసీఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా శుద్దిత జలాలను రెండు నెలల్లో అందించనున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులతోపాటు పిల్లలు సైతం తన కోసం పని చేస్తున్నారని నియోజకవర్గంలో కోచింగ్‌సెంటర్‌లను పెట్టి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని తెలిపారు. అది జరగకపోతే రూ10లక్షల సబ్సిడీ రుణాలను ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి,  నర్సింహానాయక్, సురేందర్‌రావు, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ సభ్యు రాలు యాకమ్మ, ఆయా గ్రామాల నాయకులు రంగు కుమార్, కృష్ణారెడ్డి, యాకనారాయణ, దయాకర్, బొమ్మెర వీరస్వామి, శ్రీరాములు, ఉల్లెంగుల నర్సయ్య, వెంకటాచారి, వీరన్న పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top