
ఎల్లుండే సభ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
సాయంత్రం ఆరు గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే సభకు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. జిల్లా నుంచి పోటీచేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు భారీగా జనాన్ని సమీకరించేందుకు పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే సభాస్థలికి సంబంధించిన అనుమతి తీసుకున్నారు.
ఎక్కువ స్థానాలే లక్ష్యంగా...
సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం గ్రామస్థాయిలో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌కు తొలి నుంచి పట్టున్న జిల్లాగా వరంగల్ గుర్తింపు పొందింది. తాజా పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తొలిసారిగా టీఆర్‌ఎస్ ఒంట రి పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జిల్లాలో ఎక్కువ స్థానాలే లక్ష్యంగా గులాబీ దళం సాగుతోంది. అరుుతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, జంపింగ్‌లు, అలకలు, నిరసనలతోపాటు కొత్తవారి చేరికలతో టీఆర్‌ఎస్ పార్టీలో ప్రత్యేక వాతావరణం నెలకొంది.
టికెట్ లభించని నేతలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పార్టీలో, ఉద్యమంలో కనీస పాత్రలేని వారికి... వ్యతిరేకులకు ఈ దఫా టికెట్లు కేటాయించడాన్ని టీ జేఏసీ, కేయూ జేఏసీ, విద్యావంతుల వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ జిల్లా నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెల కొంది. నాయకులు ఎవరికి వారు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలోబహిరంగ సభ ద్వారా నాయకుల్లో అంతర్గత విభేదాలను తొలగించడంతోపాటు తెలంగాణవాదుల్లో వ్యక్తమైన ప్రతికూలతల ప్రభావం తగ్గించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ సభ దోహదం చేస్తుందనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక నేతలు భారీ జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు.
నేతల స్థల పరిశీలన
సభ నిర్వహించే హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌ను టీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, కోరబోయిన సాంబయ్య, మర్రి యాదవరెడ్డి, లలితాయాదవ్, మరుపల్ల రవి, జోరిక రమేష్, గైనేని రాజన్ పాల్గొన్నారు.