రెండేళ్లలో అద్దంలా .. గ్రామీణ రహదారులు 

KCR Dissatisfied on road maintenance and repairs - Sakshi

ప్రతీ ఊరికి కచ్చితంగా రోడ్డు ఉండాలి 

రోడ్ల నిర్వహణ, మరమ్మతుల తీరుపై అసంతృప్తి 

రోడ్లు–భవనాల శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులను అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ(డాంబర్‌) రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? అనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.దీనికి అవసరమైన బడ్జెట్‌ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో రోడ్లు–భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా అవసరమైన చోట రహదారులకు మరమ్మతులు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన వంతెనలకు మరమ్మతులు చేయాలని, ఇరుకు బ్రిడ్జిలను వెడల్పు చేయాలని చెప్పారు. దీనికోసం రోడ్లు, భవనాల శాఖలోని ఈఎన్‌సీ స్థాయి నుంచి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారుల సదస్సు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ రోడ్డు పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని కోరారు. జిల్లా, మండలం అనే తేడా లేకుండా... ఏ పార్టీ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం పక్కన బెట్టి... ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లుమరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం రోడ్ల మరమ్మతు పనులను చేయించుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్‌ నుంచి రోడ్లు–భవనాల శాఖకు, ఆ శాఖ నుంచి జాతీయ రహదారులకు రోడ్లు బదిలీ , నిర్వహణ, మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు నిర్మాణం పూర్తయ్యే వరకు పాత రోడ్లు పాడుపడినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రోడ్లను బదిలీ చేసే సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు. 

ఎమ్మెల్యే కార్యాలయాలు పూర్తిచేయాలి.. 
 దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం చేపట్టామని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన నివాసగృహాలను ఎమ్మెల్యేలకు కేటాయించనున్నట్లు తెలిపారు.ముఖ్య కార్యదర్శులు సునీల్‌శర్మ, కె.రామకృష్ణారావు, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) గణపతిరెడ్డి, ఎస్‌.ఇ.చంద్రశేఖర్, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతులకు వెంటనే భూ పరిహారం... 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందివ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముథోల్‌ నియోజవకర్గం పరిధిలోని రైతులకు పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందించారు. వెంటనే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్న సుద్ధవాగు ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన ప్రజలకు భూ పరిహారం, పునరావాసం ప్యాకేజీ ఇవ్వాలని, ముథోల్‌ కమ్యూనిటీ హాల్‌ను అప్‌ గ్రేడ్‌ చేయాలని ఎమ్మెల్యే కోరారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top