సెంటిమెంట్‌ జిల్లా నుంచే..

KC KCR Massive Meeting In Husnabad - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ముందస్తు ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం కుదిరినట్లే. 6న అసెంబ్లీని రద్దు చేసి కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు అదే రోజు తెరవేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్టానం నుంచి మంగళవారం మధ్యాహ్నమే సంకేతాలు అందాయి. 7న హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో  వివిధ పనులపై హైదరాబాద్‌ వెళ్లిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను హుస్నాబాద్‌కు వెళ్లాలని మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ఆదేశించినట్లు సమాచారం. 6న అసెంబ్లీ రద్దు.. 7న హుస్నాబాద్‌లో నిర్వహించే బహరంగ సభ ద్వారా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల నగారా మోగించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముందస్తు ఎన్నికలు ఖాయంగా తేలడంతో కేసీఆర్‌ కలిసొచ్చిన సెంటిమెంట్‌ కోట.. కరీంనగర్‌ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ముందస్తు’ సభలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఉమ్మడి కరీంనగర్‌లోని హుస్నాబాద్‌ను వేదికగా చేసుకున్నారు.

సెంటిమెంట్‌ జిల్లా నుంచే నగారా..
సెంటిమెంట్‌ ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో 7న మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణపై మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ సిద్దిపేటలో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్‌లో సభ నిర్వహణకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మె ల్యే సతీష్‌రావుతో కలిసి స్థల పరిశీలన చేశారు. చివరకు హుస్నాబాద్‌ ఆర్టీసీ బస్‌ డిపో స్థలంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్‌ అర్బన్, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు మండలాల వారీగా ఇన్‌చార్జీలను కూడా నియమించారు.

మంత్రి ఈటల రాజేందర్‌ ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులతో జన సమీకరణపై ఇన్‌చార్జీలతో మాట్లాడారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్‌ హాజరయ్యే భారీ సభకు 65 వేల మందిని సమీకరించాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్‌ టౌన్, హుస్నాబాద్‌ మండలం నుంచి 15 వేలు, ఎల్కతుర్తి నుంచి 6 వేలు, భీమదేవరపల్లి నుంచి 10 వేలు, అక్కన్నపేట మండలం నుంచి 10 వేలు, కోహెడ మండలం నుంచి 10 వేలు, సైదాపూర్‌ మండలం నుంచి 10 వేలు, చిగురుమామిడి మండలం నుంచి 6 వేల మందిని సభకు తీసుకొచ్చేలా ప్రణా ళికలు, కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు.

పెద్ద ఎత్తున తరలిరావాలి..
ఈ మేరకు 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ వెల్లడించారు. హుస్నాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభకు హుస్నాబాద్‌ పట్టణ సమీపంలోని పోతారం, పందిళ్ల, కూచనపల్లి, మాలపల్లి, ఆరెపల్లి, హుస్నాబాద్‌ టౌన్, పోతారం, పొట్లపల్లి, కొండాపూర్, నాగారం, ఉమ్మాపూర్, గాంధీనగర్‌ తదితర గ్రామాల నుంచి పాదయాత్రల ద్వారా రావాలని పిలుపునిచ్చారు. గిరిజన నృత్యాలు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కాగా.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
తొలి అడుగులిక్కడి నుంచే..
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. ముఖ్య మంత్రి హోదాలో తొలిసారిగా అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచే శ్రీకారం చుట్టారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం కరీంనగర్‌లో సింహగర్జన పేరుతో నిర్వహించిన తొలి బహిరంగసభ భారీ స్థాయిలో విజయవంతమైంది. అప్పటి నుంచి కేసీఆర్‌ ఈ జిల్లాను సెంటిమెంట్‌గా నమ్ముకున్నారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి కరీంనగర్‌ జెడ్పీని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో కరీంనగర్‌ ఎంపీ సీటుకు పోటీ చేసిన కేసీఆర్‌ 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి తొలి విజయం అందుకున్నారు.

కాంగ్రెస్‌ను విభేదించి ఎంపీ పదవికి రాజీనామా చేసి 2006లో ఇక్కడి నుంచే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు రెఫరెండంగా మారిన ఆ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచే కేసీఆర్‌ కరీంనగర్‌ను తన అడ్డాగా మార్చుకున్నారు. నగర శివార్లలోని తీగలగుట్టపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఉత్తర తెలంగాణ భవన్‌ అని పేరు పెట్టుకున్నారు. ఉద్యమానికి ఊపిరిలూదేందుకు 2008లో మరోసారి టీఆర్‌ఎస్‌ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా.. తాను నమ్ముకున్న కరీంనగర్‌ ప్రజలు కేసీఆర్‌ను వరుసగా మూడోసారి ఎంపీగా గెలిపించారు. అనంతరం చేపట్టిన మలి విడుత ఉద్యమానికి కరీంనగర్‌ కీలక వేదికైంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా చెప్పుకునే ఆమరణ దీక్షకు కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచే బయల్దేరారు. అల్గునూరు వద్ద అరెస్ట్‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు అదే కేంద్ర బిందువైంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన కరీంనగర్‌ నుంచే మొదలు పెట్టారు. మెజారిటీ సభ్యుల విజయంతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. తన సెంటిమెంట్‌ను నిజం చేసుకున్నారు. ఇక్కణ్నుంచి చేపట్టిన ప్రతీ కార్యక్రమం విజయవంతం కావడంతో, ప్రభుత్వ పరంగా కూడా సక్సెస్‌ను చవిచూడడానికి కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచి జిల్లాలో తొలి పర్యటనతో పాటు హరితహారం, రైతు సమన్వయ సమితి.. ఇలా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top