ఏడాదిపాటు పీవీ శతాబ్ది ఉత్సవాలు: కేశవరావు

K Keshava Rao Launched PV Narasimha Rao Centenary Celebrations Logo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత దివంవత పీవీ నరసింహరావు అని పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు‌ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పీవీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్‌పీజీ సృష్టికర్త అని కొనియాడారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశనాయకుడని అన్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (అందుకు గర్వపడుతున్నా: మహమూద్‌ అలీ)

జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరిస్తారని కేశవరావు తెలిపారు. ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి అన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్‌)

కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ తెలిపారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్‌ గుర్తు చేశారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్‌ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన‌ బాటలేనని ప్రభాకర్‌ పేర్కన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top