ఉద్యోగ భాగ్యం!

Job Opportunities In Private Sector In Hyderabad - Sakshi

కొలువుల్లో నగరానికి రెండో స్థానం

ఉద్యోగ కల్పనలో 18 శాతం వృద్ధి 

తొలి స్థానంలో బెంగళూరు

నౌకరీ డాట్‌ కామ్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొలువుల జాతర మొదలైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. మహానగరం పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో 18 శాతం వృద్ధి నమోదైనట్లు నౌకరీ డాట్‌ కామ్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని మెట్రో నగరాలలో గ్రేటర్‌ సిటీ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ సంస్థ నగరంలో ప్రధానంగా ఐటీ, బీపీఓ, నిర్మాణ రంగం, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, టెలికం, ఇన్సూరెన్స్, ఫార్మా తదితర విభాగాల్లో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నూతనంగా సృష్టించిన ఉద్యోగాలను లెక్కించింది. ఆయా రంగాల్లో సుమారు 75 వేల మందికి నూతనంగా కొలువులు దక్కినట్లు పేర్కొంది.  

ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్‌రంగాల్లో అత్యధికం..
దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పనలో గ్రీన్‌సిటీ బెంగళూరు 20 శాతం వృద్ధితో తొలిస్థానంలో నిలవగా.. 18 శాతం వృద్ధితో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో అన్ని రంగాల్లో ఉద్యోగాల వృద్ధి రేటు 10 నుంచి 14 శాతానికే పరిమితమైనట్లు అధ్యయనం వెల్లడించింది. అత్యధికంగా సిటీలో ఆటో మొబైల్స్, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో కొలువుల కల్పన ఉందని.. ఆ తర్వాత ఐటీ, బీపీఓ, ఫార్మా రంగాలు నిలిచాయని పేర్కొంది. ఇక చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారితోపాటు మూడేళ్ల అనుభవం ఉన్నవారికీ నగరంలో నూతన కొలువులు దక్కుతున్నట్లు తెలిపింది.  

ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్‌
హైదరాబాద్‌లో ఆటోమొబైల్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దేశ, విదేశీ వాహన కంపెనీలు, వాటి షోరూమ్‌లు, సర్వీసింగ్‌ కేంద్రాలు, వాటి విడిభాగాలు విక్రయించే దుకాణాలు వందలాదిగా వెలుస్తున్నాయి. వాటిల్లో ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మరోవైపు బహుళజాతి బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు సైతం బీమా రంగంలోకి ప్రవేశించడంతో ఈ రంగంలోనూ వేలాది మంది ఫ్రెషర్స్‌కు కొలువులు దక్కుతున్నాయి.

నిర్మాణ రంగం
గ్రేటర్‌ సిటీలో నిర్మాణ రంగానికి కొంగు బంగారంగా మారింది. కోర్‌సిటీ కంటే శివారు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్‌ గృహాలు లక్షలాదిగా వెలుస్తున్నాయి. బడా నిర్మాణ రంగ కంపెనీలు నగరంపై దృష్టి సారించడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

ఐటీ, బీపీఓ
కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల రాకతో ఐటీ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఈ రంగంలో నూతన ఉద్యోగాల కల్పన ఊపందుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా.. ఈ ఏడాది నూతనంగా మరో 25 వేల వరకు ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక బీపీఓ రంగం శరవేగంగా విస్తరిస్తోందని.. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని నిపుణులు తెలిపారు.

ఫార్మా
బల్క్‌ డ్రగ్, ఫార్మా క్యాపిటల్‌గా పేరొందిన గ్రేటర్‌ సిటీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ తదితర కోర్సులు చదివిన వారికి ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నట్లు నౌకరీ డాట్‌ కామ్‌ అధ్యయనంలో వెల్లడైంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top