
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. యావత్ భారతదేశం నిబద్ధతతో జనతా కర్ఫ్యూ పాటించింది.సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఇళ్ల లోగిళ్లలో నిలబడి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి...వారందరికి సంఘీభావం ప్రకటించారు.
వారికి నా సెల్యూట్ : సీఎం జగన్
అంకుఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జవాన్లు, పోలీసుతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నవారికి రుణపడి ఉంటామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.