భవిష్యత్తులో ‘టెన్త్‌’ పునఃమూల్యాంకనం

Janardhan Reddy Held Meeting Over Telangana Tenth Results - Sakshi

సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం

ఐదంచెల తనిఖీల తర్వాతే ఫలితాలు విడుదల

హెచ్‌ఎంల లాగిన్‌కు స్కూల్‌ రిజల్ట్స్‌ షీట్‌

త్వరలో ప్రత్యేక యాప్‌ ద్వారా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల పునఃమూల్యాంకనం (రీ వ్యాల్యుయేషన్‌) నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టి. విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది కాకపోయినా, భవిష్యత్తులో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. పునఃమూల్యాంకనం నిర్వ హించాలని సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన కోర్టు తీర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్‌ ఫలితాల్లో లోపాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రకటనలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

అత్యంత పకడ్బందీగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్నారు. ఫలితాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జవాబు పత్రాల ఐదంచెల పరిశీలన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారమన్నారు. ఎవరికైనా సున్నా మార్కులొచ్చినా, గైర్హాజరని వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిలై మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన నిర్వహించి ధ్రువీకరించుకున్నామన్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇలాంటి కేసులను గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజయ్‌ కుమార్‌ చెప్పారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల ముందే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.
 
ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు ఫలితాలు.. 
ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతోపాటు ఈ ఏడాది తొలిసారిగా ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు సంబంధిత పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కన్సాలిడేటెడ్‌ రిజల్ట్స్‌ షీట్‌ను పంపిస్తున్నామని విజయ్‌ కుమార్‌ తెలిపారు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు వారి పాఠశాలకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవడంతోపాటు ప్రధానోపాధ్యాయుడి నుంచి కౌన్సెలింగ్, సలహాలు పొందొచ్చని వివరించారు. పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు/ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త మొబైల్‌ యాప్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని యాప్‌లో ఎంటర్‌ చేయడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞప్తిని టైప్‌ చేసి పదో తరగతి బోర్డుకు పంపొచ్చని, అలా పంపిన వారికి అక్నాలెడ్జ్‌మెంట్‌ సైతం పంపిస్తామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top