'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'

'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం' - Sakshi


హైదరాబాద్ : అవహేళన చేసేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. జడ్జిమెంట్ ఇవ్వకుండానే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్ఎస్ఓల చర్య ప్రతీకార దాడిగా కనిపిస్తోందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఎస్ఓలు ఈ నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకుంటే సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే వారి నిర్ణయంలో ప్రభుత్వం ఒత్తడి ఉండకూడదన్నారు.



అయితే ప్రసార మాధ్యమాలు కూడా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన మరోవైపు వ్యాఖ్యలు చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, అయితే అది హద్దులో ఉండాలన్నారు. శాసనసభను హేళన చేసేలా టీవీ-9 చూపించటం విచారకరమని జానారెడ్డి అన్నారు. ఆ చర్యను తాము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.



కాగా  ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోరటం సరికాదని జానారెడ్డి అన్నారు. అది విభజన చట్టాన్ని ఉల్లంఘించటమేనని అన్నారు. ఈఆర్ఎస్కి చంద్రబాబు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని జానా ప్రశ్నించారు. పీపీఏలను రద్దు చేయరాదంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు సరికాదని ఆయన అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top