జగిత్యాల, రంగారెడ్డి టాప్‌ | Jagtial and Ranga Reddy was top in the land records cleansing | Sakshi
Sakshi News home page

జగిత్యాల, రంగారెడ్డి టాప్‌

Dec 24 2017 1:27 AM | Updated on Nov 9 2018 5:56 PM

Jagtial and Ranga Reddy was top in the land records cleansing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా... ఇప్పటివరకు 30 జిల్లాల పరిధిలో 85 శాతం రికార్డులను సరిచేశారు. సర్వే నంబర్ల వారీగా చూస్తే... 10,873 రెవెన్యూ గ్రామాల్లో 1.78 కోట్ల సర్వే నంబర్లు ఉండగా... శనివారం నాటికి 1.69 కోట్ల సర్వే నంబర్ల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించింది. మిగతా 10 లక్షల సర్వే నంబర్లలోని రికార్డుల పరిశీలన, తప్పుల సవరణ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. మరో 15 శాతంలో 5–6 శాతం రికార్డుల్లోని తప్పులను సవరించే అవకాశముందని.. ఇవన్నీ పోగా మిగిలే 9–10 శాతం రికార్డులను.. మరికొంత పరిశీలన, ఇతర ప్రక్రియల అనంతరం సరిచేసే అవకాశముందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 

99 శాతంతో రికార్డు 
భూరికార్డుల ప్రక్షాళనలో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జగిత్యాలలో అత్యధికంగా 99.52 శాతం రికార్డులను సవరించగా, రంగారెడ్డి జిల్లాలో 99.14 శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర్బన్, మేడ్చల్, సిద్దిపేట, నల్లగొండ, పెద్దపల్లి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా 90శాతంపైగా రికార్డుల ప్రక్షాళన పూర్తయింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రక్షాళన మందకొడిగా సాగుతోంది. జిల్లాలోని 2.93 లక్షల సర్వే నంబర్లకు 1.80 లక్షల సర్వే నంబర్లలో మాత్రమే పరిశీలన పూర్తికాగా.. ఇందులో 88,360 సర్వే నంబర్ల రికార్డులే సరిగా ఉన్నాయి. వీటితోపాటు మరో 1,155 సర్వే నంబర్ల రికార్డులను సరిచేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం రికార్డుల సవరణ పూర్తికాగా.. 20 జిల్లాల్లో 80 కన్నా ఎక్కువగా భూరికార్డులను సవరించారు. 

‘మాన్యువల్‌’తో జాప్యం! 
భూరికార్డుల ప్రక్షాళన అనంతరం పహాణీ లను మాన్యువల్‌గా తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. రికార్డుల పరిశీలన పూర్తయిన మండలాలు, గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పహాణీని మాన్యువల్‌గా రాయాల్సి వస్తుండడం వీఆర్వోలకు ఇబ్బందికరంగా మారింది. అంతేగాకుండా ఈ మాన్యువల్‌ పహాణీల్లో తప్పులు సరిచేసి, అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఈ నమోదు ప్రక్రియకు నెల రోజులు పట్టే అవకాశముందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement