లేజర్‌ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌ 

Hyderabad Will Be A Laser Technology Hub Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్నాళ్లూ ఫార్మా, ఐటీ రంగాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై లేజర్‌ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) డైరక్టర్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ త్రివేదీ వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన 2 వేర్వేరు బృందా లు గురువారం టీఐఎఫ్‌ఆర్‌ను సందర్శించాయి. లేజర్‌ టెక్నాలజీపై పరిశోధనలకు వీలుగా హైదరాబాద్‌ టీఐఎఫ్‌ఆర్‌ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసే ఫోటానిక్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ (ఎపిక్‌)కు కేంద్రం రూ.896 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బ్రిటన్‌ భాగస్వామ్యంతో జరిగే ఈ పరిశోధనల కోసం యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ (యుక్రి) మరో రూ.25 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. లేజర్‌ పరిశోధనకు అనువైన మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటంతో యుక్రి అనుబంధ సంస్థ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెసిలిటీస్‌ కౌన్సిల్‌ (ఎస్‌టీఎఫ్‌సీ) ఆసక్తి చూపుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ టీఎఫ్‌ఐఆర్‌లో 150 టెరావాట్ల సామర్థ్యమున్న లేజర్‌ కిరణాలను సృష్టించి, పరిశోధనలు చేస్తున్నట్లు త్రివేదీ వెల్లడించారు. భవిష్యత్తులో ఎపిక్‌లో జరిగే పరిశోధనల ద్వారా ఒక పెటా వాట్‌ (సుమారు వేయి టెరావాట్లు) సామర్ద్యమున్న లేజర్‌ కిరణాలను సృష్టిస్తామన్నారు. 

కృత్రిమ నక్షత్రాల తరహా.. 
అత్యంత సామర్థ్యమున్న లేజర్‌ కిరణాల ద్వారా అంతరిక్ష పరిశోధనలతో పాటు కేన్సర్, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత మెరుగ్గా చేసేందుకు వీలుంటుందని సందీప్‌ త్రివేదీ వెల్లడించారు. ఎపిక్‌లో సృష్టించే అధిక సామర్థ్యం ఉన్న లేజర్‌ కిరణాలను ‘కృత్రిమ నక్షత్రాలు’గా అభివర్ణిస్తూ, ఈ కిరణాల నుంచి వెలువడే ఎలక్ట్రాన్లు, రేడియేషన్, ప్లాస్మా కిరణాలు వివిధ రంగాల్లో పరిశోధనలకు కల్పిస్తాయన్నారు. సీసీఎంబీ, ఐఐసీటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎపిక్‌ ఏర్పాటు ద్వారా లేజర్‌ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని చెప్పారు. యుక్రి అనుబంధ ఎస్‌టీఎఫ్‌సీ చైర్మన్‌ మార్క్‌ థాంప్సన్‌ మాట్లాడుతూ.. లేజర్‌ టెక్నాలజీ పరిశోధనలో భారత్, బ్రిటన్‌ భాగస్వామ్యం ద్వారా అనేక అద్భుత ఫలితాలు సాధించామన్నారు. 

20 యూనివర్సిటీల వీసీల బృందం 
బ్రిటన్‌కు చెందిన 20 యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్ల బృందం టీఐఎఫ్‌ఆర్‌ను గురువారం సందర్శించింది. ఎక్స్‌టర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ స్టీవ్‌ స్మిత్‌ నేతృత్వంలోని ఈ బృందంలో ఆస్టన్, బర్మింగ్‌హామ్, కాన్వెంట్రీ, మాంచెస్టర్, బ్రిస్టల్, ఎడిన్‌బరో, నాటింగ్‌హాం తదితర యూనివర్సిటీలకు చెందిన వీసీలు ఉన్నారు. లేజర్‌ టెక్నాలజీ సంబంధ పరిశోధనలకే పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోనూ టీఐఎఫ్‌ఆర్‌తో సంయుక్త భాగస్వామ్యంలో పరిశోధనలకు ఉన్న అవకాశాలపై వీసీల బృందం చర్చించింది. ఈ కార్యక్రమంలో సంస్థ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.చంద్రశేఖర్, కొలాబా విభాగం భౌతిక శాస్త్రవేత్త రవీంద్రన్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top