‘చెత్త’ రికార్డు మనదే..

Hyderabad Is Top In Producing Waste - Sakshi

హైదరాబాద్‌లోనే తలసరి వ్యర్థాల ఉత్పత్తి అత్యధికం

నిత్యం ఒక్కో వ్యక్తి ద్వారా సగటున 570 గ్రాముల చెత్త ఉత్పత్తి

‘నీరి’ తాజా అధ్యయనంలో వెల్లడి

వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లే అత్యధికం..

ప్రజాచైతన్యంతోనే పరిష్కారమంటున్న పర్యావరణవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌ : పేరుకే మనది అందాల ‘భాగ్య’నగరం... కానీ పరిశుభ్రతలో మాత్రం దుర్భరం...! పాలకులు పిలుపునిచ్చిన స్వచ్ఛ హైదరాబాద్‌... సాఫ్, షాన్‌దార్‌ హైదరాబాద్‌ లక్ష్యాలు నేటికీ అందనంత దూరం! ప్రభుత్వం తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నగరంలో ఇంటింటికీ ఉచితంగా రెండేసి డస్ట్‌బిన్‌లు అందించినా గ్రేటర్‌వాసులు మాత్రం ఇంకా ఎక్కడికక్కడ రోడ్లపైనే చెత్త పారబోస్తున్నారు. దీంతో ఓ ‘చెత్త’రికార్డును సిటీ మూటగట్టుకుంది. తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్‌ నగరమే తొలి స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తున్నట్లు నాగ్‌పూర్‌కు చెందిన జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ (నీరి) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 510 గ్రాముల తలసరి చెత్త ఉత్పత్తితో చెన్నై రెండోస్థానంలో ఉండగా, 410 గ్రాములతో ఢిల్లీ మూడో స్థానంలో, 360 గ్రాములతో అహ్మదాబాద్‌ నాలుగో స్థానంలో, 300 గ్రాములతో ముంబై ఐదో స్థానంలో నిలిచాయి. కోల్‌కతాలో కేవలం 260 గ్రాముల చెత్త ఉత్పత్తితో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు వ్యర్థాల ఉత్పత్తి ఇతర పెద్ద నగరాల స్థాయిలోనే ఉందని సర్వే తేల్చింది. నగరంలో రోజుకు 4,500 టన్నుల వ్యర్థాలను సేకరిస్తుండగా అహ్మదాబాద్‌లో 2,300 టన్నులు, బెంగళూరులో 3,700 టన్నులు, చెన్నైలో 4,500 టన్నులు, కోల్‌కతాలో 3,670 టన్నులు, ఢిల్లీలో 5,800 టన్నులు, ముంబైలో 6,500 టన్నుల చొప్పున నిత్యం వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రజలు భారీగా చెత్తను పడేస్తుండటంతో వ్యర్థాలను వేరు చేయడం నగరపాలక సంస్థకు తలకు మించిన భారం అవుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.  

వ్యర్థాల్లో అత్యధికం ఇవే.. 
ప్లాస్టిక్‌ కవర్లు, వాడి పడేసిన పాదరక్షలు, బ్యాగులు, గృహ వినియోగ వస్తువులు, పండ్లు, కూరగాయల వ్యర్థాలు, పాత దుస్తులు, ఇళ్లలో వినియోగించే ప్లాస్టిక్‌ వస్తువులు, ప్యాకింగ్‌ కాటన్లు, పేపర్లు, నీళ్ల సీసాలు, కిచెన్‌ వేస్ట్, కుళ్లిన ఆహార పదార్థాలు, శానిటరీ న్యాప్‌కిన్స్‌ తదితరాలున్నాయి. ఈ వ్యర్థాల్లో ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, ఈ–వేస్ట్, సాఫ్ట్‌ సెల్స్, బ్యాటరీ సెల్స్‌ వంటి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. 
పలు మెట్రో నగరాల్లో తలసరి వ్యర్థాల ఉత్పత్తి ఇలా.. 

స్థానం                   నగరం                     తలసరి వ్యర్థాల ఉత్పత్తి (గ్రాముల్లో) 

1.                     హైదరాబాద్‌                           570 
2.                        చెన్నై                               520 
3.                         ఢిల్లీ                                 410 
4.                     అహ్మదాబాద్‌                        360 
5.                     ముంబై                                300 
6.                      కోల్‌కతా                             260 

కోరలు చాస్తున్న ప్లాస్టిక్‌ భూతం... 
గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ భూతం కోరలు చాస్తోంది. పేరుకు నిషేధం అమల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాలు, మార్కెట్లు, మాల్స్‌.. ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లే దర్శనమిస్తున్నాయి. ఇవి క్రమంగా మహానగరంలోని ప్రధాన నాలాలు, వరద, మురుగునీటి పైపులైన్లలోకి చేరుతుండటంతో మురుగునీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు ఇటీవల పలు ప్రాంతాల్లో చేపట్టిన డీ సిల్టింగ్‌ ప్రక్రియలో పలు పైపులైన్లు, వరదనీటి కాల్వల్లో వెలికితీస్తున్న ఘన వ్యర్థాల్లో 30 శాతం ప్లాస్టిక్‌ కవర్లే దర్శనమిస్తుండటం గమనార్హం. అంతేకాదు మురుగు ప్రవాహానికి పలు చోట్ల ఆటంకాలు ఎదురై ప్రధాన రహదారులు, వీధులు మురికికూపాలుగా మారుతున్నాయి. నిషేధం అమలుపై జీహెచ్‌ఎంసీ, పరిశ్రమలశాఖ, పీసీబీ తదితర విభాగాలు దృష్టిసారించకపోవడం, ప్రజలు, వ్యాపారుల్లో అవగాహనలేమి నగరంపాలిట శాపంగా మారుతోంది.

నిత్యం 2 కోట్ల ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం... 
నగరంలో ప్రతి వ్యక్తి నిత్యం సరాసరిన రెండు చొప్పున వివిధ మందాలతో కూడిన ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నట్లు పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 2 కోట్ల ప్లాస్టిక్‌ కవర్లు వాడకంలో ఉంటున్నట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వాటి వినియోగం రోజుకు 1.40 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. వినియోగిస్తున్న కవర్లలోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందంగల కవర్లే ఎక్కువగా ఉంటున్నాయని, వాటిపై నిషేధం అమల్లో ఉన్నా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం ఎక్కడా తగ్గకపోగా పెరుగుతోందని చెబుతున్నారు.  

తూతూమంత్రంగానే నిషేధం.. 
గ్రేటర్‌ పరిధిలో 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నిషేధించినా పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. బల్దియా అధికారులు దాడులు చేసి అక్రమార్కులపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు కనిపించడంలేదు. ఇక మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ప్లాస్టిక్‌ కవర్ల తయారీ సంస్థలుండగా..వీటిలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన కంపెనీలు సగమైనా లేవన్నది పరిశ్రమలశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

జనచేతనే కీలకం.. 
ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో చట్టాలెన్ని ఉన్న ప్రజల్లో అవగాహన, చైతన్యమే కీలకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇంటి నుంచి మార్కెట్లు, షాపింగ్‌కు వెళ్లే సమయంలో పేపర్‌ బ్యాగులు, గోనె సంచులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయాలు, మాంసం సహా ఇతర నిత్యావసరాల కోసం కవర్లు వాడొద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు వాటి మందాన్నిబట్టి విఛ్చిన్నమై పర్యావరణంలో కలిసేందుకు 200 ఏళ్ల నుంచి వెయ్యేళ్లు పడుతుందని, భూగర్భ జలాలు సైతం విషతుల్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top