బిల్లు..లొల్లి!

Hyderabad Lake Devolopment Works Delayed - Sakshi

పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

చేసిన వర్క్‌కు సకాలంలో బిల్లులు రావని విముఖత

ఏడాదిగా మొదలుగాని అభివృద్ధి పనులు  

కాగితాలకే పరిమితమైన ‘సుందర తటాకాలు’  

సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని చెరువుల సుందరీకరణ అటకెక్కింది. ప్రస్తుతం ఉన్న దాదాపు 170 చెరువుల్లో 20 తటాకాలను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకు కార్యరూపం దాల్చనేలేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మిషన్‌  కాకతీయ నిధులతో నగరంలోని 20 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఆ మేరకు గతేడాది మార్చిలో ప్రభుత్వం అనుమతించింది. ఏడాది కాలం గడిచి.. మళ్లీ మార్చి నెల వచ్చినా ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఒక్క చెరువూ ప్రక్షాళన కాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడమేనని తేలింది.

దాదాపు ఐదారు పర్యాయాలు ఈ పనుల కోసం టెండర్లు పిలిచినా నాలుగైదు పనులకు తప్ప మిగతా వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వ్యయ ప్రయాసలకోర్చి పనులు చేసినా సకాలంలో బిల్లులు అందుతాయో లేదో అనే సంశయంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదని సమాచారం. దీంతోపాటు గతేడాది ఎన్నికల కారణంగానూ కొన్ని నెలలపాటు అధికారులు కూడా వీటిపై శ్రద్ధ చూపలేదు. దీంతోపాటు ఎన్నికల కోడ్‌తోనూ టెండరు అగ్రిమెంట్లకు అవకాశం లేకపోవడం తదితరమైనవి మరికొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే, అన్నీ చక్కబడ్డాక.. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. కేవలం చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లిచరనే కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. 

అమలుకు నోచని హామీ..
గత సంవత్సరం నగరంలోని సరూర్‌ చెరువు దుస్థితిని వివరిస్తూ నగర పౌరుడొకరు అప్పటి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దాంతో సహా నగరంలోని 20 చెరువుల్ని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ ప్రకటించడమేగాక.. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే అధికారులు పనుల కుపక్రమించి.. ఈ పనులకు రూ.287.93 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం మిషన్‌ కాకతీయ నాలుగో దశ కింద రూ.282.63 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన పర అనుమతులు జారీ చేసి టెండర్లు ఆహ్వానించారు. కానీ.. పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది.  

వీటిలో మూడు చెరువుల అభివృద్ధికి సీఎస్సార్‌ కింద  నిధులిచ్చేందుకు కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు దచ్చాయి. దీంతో వాటి స్థానే ఇతర చెరువులను అభివృద్ధి చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా అంచనాలు రూ.279.78 కోట్లకు తగ్గాయి. 

కార్యరూపం దాల్చని ‘ప్రైవేట్‌’ ప్రతిపాదన
నగరంలోని మిగతా చెరువులను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ నిధులతో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. చెరువుల ప్రక్షాళన పూర్తయ్యాక, తిరిగి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు దిగువన సదుపాయాలు కల్పించడం ఇందులోని ప్రధాన లక్ష్యం.  
1. చెరువు/సరస్సు స్థలం మేర ప్రహరీ/ఫెన్సింగ్‌ ఏర్పాటు
2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లు వంటి సుందరీకరణ పనులు
3. నడక మార్గాల ఏర్పాటు
4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం  
5. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీల వంటి ఏర్పాట్లు
6. వాహన పార్కింగ్‌ సదుపాయం
7. రాత్రివేళల్లో అందమైన లైటింగ్‌
8. స్నాక్స్, టీ/కాఫీల కేఫటేరియా
9. వాననీరు వెళ్లేందుకు బైపాస్‌ డ్రెయిన్లు
10. టాయిలెట్లు తదితర సదుపాయాలు  
చెరువుల వద్ద జలక్రీడలు, బోటింగ్‌ వంటి వినోద కార్యక్రమాలతో వచ్చే ఆదాయన్ని చెరువు పనులు చేసిన ప్రైవేట్‌ సంస్థకు కొన్నేళ్ల పాటు ఇవ్వాలనేది లక్ష్యం. తర్వాత సదరు చెరువులు జీహెచ్‌ఎంసీ అజమాయిషీలోకే వస్తాయని పేర్కొన్నారు. కానీ ఆ దిశగానూ ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top