భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తాటిమట్టతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
చింతపల్లి (నల్లగొండ జిల్లా) : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తాటిమట్టతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన వసంత్, స్వప్న(28) దంపతులు మండలంలోని కురంపల్లిలో ఉన్న కోళ్లఫారంలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
కాగా గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వసంత్ ఆదివారం భార్యను కోళ్లఫారం సమీపంలో ఉన్న పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడ తాటిమట్ట(గరిమట్ట)తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణించడం, తండ్రి జైలు పాలుకావడంతో చిన్న పిల్లలు ఇద్దరూ ఆలనాపాలనకు దూరమయ్యారు.