వీర పోరాటాల గడ్డ తెలంగాణ

Himachal Pradesh Governor Bandaru Dattatreya Speech In Karimnagar - Sakshi

మన సంస్కృతి భావితరాలకు స్ఫూర్తి కావాలి

అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దు

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ‘తెలంగాణ చరిత్ర ఐదు వేల సంవత్సరాలది. నాలుగు వేల సంవత్సరాల కింద ఇనుప పనిముట్లు, కత్తులు తదితర వస్తువుల తయారీ ఇక్కడే జరిగింది.. పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకు ఆధారాలు దొరికాయి.. ఎందరో త్యాగాల ఫలితం.. వీర పోరాటాల గడ్డే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..’ అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కరీంనగర్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. సంసృతి లేకపోతే మనం లేమని, విలువలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, యువతరానికి నిజమైన తెలంగాణ గొప్పతనం తెలియ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని, రాబోయే రోజుల్లో ప్రాచీన తెలంగాణ వైభవాన్ని అన్ని జిల్లాల్లో ఇటువంటి సదస్సులు, సమావేశాల ద్వారా విసృతం చేయాలని తెలిపారు. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దుని సూచించారు. సర్ధార్‌ పటేల్‌ ఆపరేషన్‌ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచివేసి మనకు నిజమైన స్వాతంత్య్రాన్ని 1948 సెప్టెంబర్‌ 17న తెచ్చిపెట్టారని గుర్తు చేశారు.

పటేల్‌కు తెలంగాణ ఎప్పుడూ రుణపడే ఉంటుందన్నారు. తెలంగాణ వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కొందరు తెలంగాణ చరిత్రను తిరగేస్తున్నారని, వారి చరిత్రే రాబోయే తరాల కు అందించాలని వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేస్తుంటే అవి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ అంటే మనకు గౌరమ్మ అని, గౌరమ్మను దేవతగా పూజిస్తుంటే ఆ బతుకమ్మను డిస్కో ఆటగా మారుస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా పటేల్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పటేల్‌ ఫొటో పెట్టుకొని దేని కోసం ఉద్యమాలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ వచ్చాక సెప్టెంబర్‌ 17న గొప్పగా చేసుకొందామన్న వారు ఇప్పుడు మరువడం విడ్డూరమన్నారు. పటేల్, కుమురంభీం, చాకలి అయిలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వాళ్లను మరిచి నేడు నిజాం సమాధి వద్ద మోకారిళ్లుతున్నారని విమర్శించారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ఎల్‌.రాజభాస్కర్‌ రెడ్డి, డి.నిరంజనాచారి మాట్లాడుతూ మూడు రోజుల్లో 2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ వైభవాన్ని చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర, జిల్లా బాధ్యులు బూర్ల దక్షిణమూర్తి, రాజేందర్‌ చడ్డా, దత్తాత్రేయ శాస్త్రీ, గిరిధర్, రఘు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మురళీ మనోహరచారి, విద్యాసంస్థల భాద్యులు అనంతరెడ్డి, రమణారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్, వేద సం హిత, సత్యగిరి, విజయభారతి పాల్గొన్నారు.

ప్రదర్శనలను తిలకించిన గవర్నర్‌.. 
తెలంగాణ వైభవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తిలకించారు. పురాతన కాలం నాటి నాణేలు, తెలంగాణ సంసృతిని చూపెట్టిన సమ్మక్క సారలమ్మ, ఎలగందుల ఖిల్ల, గోల్కొండ ఫోర్టు, బతుకమ్మ తదితర ప్రదర్శనలను తిలకించారు. అనంతరం పలువురు విద్యాసంస్థలకు బాధ్యులకు గవర్నర్‌ జ్ఞాపికలను బహూకరించారు. కాగా గవర్నర్‌ను ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top