
హైవే 565.. ఇదో రోడ్డు కథ!
అది రాష్ట్ర రహదారి.. సింగిల్ రోడ్డు కావటంతో ట్రాఫిక్ చిక్కులు పెరిగాయి..
నకిరేకల్–నల్లగొండ–నాగార్జునసాగర్ రోడ్డు విస్తరణకు సర్కారు నిర్ణయం
► ప్రభుత్వ భూమిగా భావించి టెండర్లు కూడా ఖరారు
► పని మొదలుపెట్టే వేళ ప్రైవేటు భూమి అని తెలిసింది
► రెవెన్యూ రికార్డులు పరిశీలించి కంగుతిన్న యంత్రాంగం
► జాతీయ రహదారి నిర్మాణంలో వింత వ్యవహారం
► ఢిల్లీలో సమీక్షించి ఎట్టకేలకు భూసేకరణకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అది రాష్ట్ర రహదారి.. సింగిల్ రోడ్డు కావటంతో ట్రాఫిక్ చిక్కులు పెరిగాయి.. దీన్ని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి ఉందంటూ జాతీయ రహదారిగా మార్చేందుకు అనుమతి పొందారు.. అంచనాలు సిద్ధమై నిధులు కూడా విడుదలయ్యాయి.
ఇక పనులు మొదలుపెట్టడమే ఆలస్యమనుకుని తట్టాబుట్టా, తారు పట్టుకుని వచ్చేశారు.. కానీ ‘మా భూముల్లో రోడ్డెలా వేస్తార’ంటూ స్థానికులు నిలదీయడంతో అధికారులు కంగుతిన్నారు. ఉరుకులు పరుగులు పెట్టి, రెవెన్యూ రికార్డులు పరిశీలించి.. అది ప్రైవేటు వ్యక్తుల భూమిగా తేలడంతో నాలుక కరుచుకున్నారు. ఈ సీన్ కట్ చేస్తే... తాజాగా శుక్రవారం ఢిల్లీలో దీనిపై పంచాయితీ జరిగింది. చివరికి ఆ ప్రైవేటు భూమిని సేకరించి రోడ్డు విస్తరించాలని నిర్ణయించారు. నకిరేకల్–నల్లగొండ–నాగార్జునసాగర్ రహదారి విస్తరణలో నెలకొన్న వ్యవహారమిది..
మూడేళ్ల కిందట హోదా వచ్చినా..
జాతీయ రహదారి 565.. తెలంగాణలో నార్కెట్‌పల్లి వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట వద్ద ముగుస్తుంది. రెండు చివరల్లో ఇతర జాతీయ రహదారులతో అనుసంధానమవుతుంది. ఈ మార్గంలో నకిరేకల్–నల్లగొండ–నాగార్జునసాగర్ మధ్య 82 కిలోమీటర్ల రహదారి ఇరుకుగా ఉంటుంది. దీనికి మూడేళ్ల కింద జాతీయ రహదారి హోదా లభించింది. అప్పటివరకు రాష్ట్ర రహదారిగా కేవలం మూడున్నర మీటర్ల వెడల్పు ఉన్న సింగిల్ రోడ్డు ఇది. ఈ రోడ్డుపై వాహనాలు ఎదురెదురుగా వస్తే నరకం కనిపించేది. జాతీయ రహదారి హోదా రావడంతో ఈ రోడ్డును 10 మీటర్లు వెడల్పు చేయాలని నిర్ణయించారు.
రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమి ఉందని అధికారులు భావించారు. అనుకున్నదే తడవుగా డీపీఆర్‌లు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.220 కోట్లు మంజూరు చేసింది. దీంతో టెండర్లు పిలిచి ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. తీరా పనులు ప్రారంభించే వేళ... నకిరేకల్–నల్లగొండల మధ్య సమస్య ఎదురైంది. రోడ్డు నిర్మాణ పనిని స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లోంచి రోడ్డును ఎలా నిర్మిస్తారని నిలదీశారు.
దీంతో కంగుతిన్న అధికారులు రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. అందులో మూడున్నర మీటర్ల రాష్ట్ర రహదారి మినహా ఇరువైపులా భూమి అంతా ప్రైవేటుదేనని తేలింది. దీంతో నకిరేకల్–నల్లగొండ మధ్య పనులు నిలిపివేశారు. నల్లగొండ–నాగార్జునసాగర్ మధ్య 42 కిలోమీటర్ల పనిని మాత్రమే ప్రారంభించారు. అయితే ఎలాగూ ఒకవైపు పని ఆగిపోయింది కదా.. తొందరేముందని అనుకున్నారో ఏమోగాని కాంట్రాక్టర్ ఆ 42 కిలోమీటర్లలోనూ 21 కిలోమీటర్ల పనిని మాత్రమే పూర్తి చేశారు. మిగతా పని పెండింగ్‌లో పడిపోయింది.
కేంద్రం స్పందించి..
దేశవ్యాప్తంగా పెండింగ్ పనుల జాబితా తీయించిన కేంద్రం.. ఈ రోడ్డుపై దృష్టి సారించింది. జాతీయ రహదారుల విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డితో శుక్రవారం సమీక్షించింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రోడ్డుకు భూసేకరణ జరపాలని.. వెంటనే పనులు మొదలుపెట్టి నెలరోజుల్లో కొలిక్కి తేవాలని నిర్ణయించారు. సగంలో పనివదిలేసిన కాంట్రాక్టర్‌ను పిలిపించి మిగతా పని పూర్తి చేయించాలని ఆదేశించారు.