ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High Court Hearing on TSRTC Route Privatisation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తూ.. క్యాబినెట్‌ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించగా.. హైకోర్టు స్పందిస్తూ.. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనములో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలంటూ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా.. ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణలో ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తుందో లేదా తెలియకుండా ఇప్పుడే చట్టవిరుద్ధమని ఎలా అంటామని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా అని పిటిషనర్‌ను అడిగింది. ప్రపంచం ఇప్పుడు గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే ఉండేదని,
స్కైను ఓపెన్ చేశాక కింగ్‌ఫిషర్ వంటి కొన్ని ప్రైవేటు ఎయిర్‌లైన్స్ రాణించలేకపోయినప్పటికీ చాలా ఎయిర్ లైన్‌ సంస్థలు విజయవంతమయ్యాయని పేర్కొంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, కార్మికుల ఆత్మహత్యలు, ఆర్టీసీ జీతభత్యాలు తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్‌ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్‌ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్‌ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. క్యాబినెట్‌ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్‌ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్‌ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్‌ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్‌ చేయాలని ఆయన హైకోర్టును కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top