హత్యలకు భారీ కుట్ర!  | Heavy conspiracy to murders | Sakshi
Sakshi News home page

హత్యలకు భారీ కుట్ర! 

Jan 7 2019 1:48 AM | Updated on Jan 7 2019 1:48 AM

Heavy conspiracy to murders - Sakshi

కూర రాజన్న (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: జనశక్తి.. మిలిటెంట్‌ మల్లన్న గ్యాంగ్‌ పేరుతో బెదిరింపులకు గురిచేసి డబ్బులు దండుకోవడం మాత్రమే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ అరెస్టయిన జననేతల నాయకుల ద్వారా సంచలన విషయాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూరరాజన్న జనశక్తిలోని నెట్‌వర్క్‌ను మళ్లీ క్రియాశీలం చేయడంతో పార్టీలోని కీలక వ్యక్తులకు తుపాకులు చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు, డాక్టర్లు, విద్యాసంస్థల యజమానులు, బీడీ కంపెనీల యజమానులు, ప్రభుత్వాధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వరకే తుపాకులను వాడుతున్నారా.. లేదా మరేదైనా కుట్రకు స్కెచ్‌ వేశారా అన్న దానిపై సిద్దిపేట, జగిత్యాల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ వ్యవహారంబెదిరింపుల వరకే కాకుండా పాత కక్షలు, జనశక్తిని విచ్ఛిన్నం చేసిన కుట్రదారులను అంతమొందించేందుకు కూడా ప్లాన్‌ వేసి ఉంటారా అన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఎటు వెళ్తుంది.. ఎంత వరకు తీసుకెళ్తుందా అన్న దానిపై కలవరం మొదలైంది. 

గన్స్‌ రావడం అంత సులభమా? 
ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలో పోలీస్‌ గస్తీ పెరిగింది. అడుగడుగునా నిఘా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోలీస్‌ శాఖకు సమాచారం లేకుండా అత్యాధునిక తుపాçకులు జనశక్తి ముఠాల చేతుల్లోకి వెళ్లడంపై ఉన్నతాధికారులు ఆందోళనలో పడ్డట్లు సమాచారం. మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో పోలీస్‌ శాఖ కొంత విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలోకి తుపాకులు తెప్పించుకుని ఏకంగా పలువురిని బెదిరిస్తుండటాన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

జనశక్తి టార్గెట్‌లో ఎవరు? 
జనశక్తి కూరరాజన్న అండ్‌ గ్యాంగ్‌ టార్గెట్‌లో కొంతమంది ఉన్నట్లు పోలీసులు విచారణలో బయటపడినట్లు తెలిసింది. ఈ టార్గెట్‌ లిస్టులో ఉన్న వాళ్లు ప్రముఖులా.. వీఐపీలా.. లేదా ప్రభుత్వాధికారులా అన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపుల కోసం కాకుండా హత్యలకే కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సాయికిరణ్‌ కొంత మంది ప్రముఖుల హత్యకు కుట్రపన్నినట్లు తెలిసింది. సిద్దిపేట పోలీసులు అరెస్ట్‌ చేసిన సంతోష్‌ అనే జనశక్తి నక్సలైట్‌ హిట్‌ లిస్టులో మాజీ మావోయిస్టులు ఉండటం సంచలనం రేపుతోంది. 

ఎక్కడి నుంచి ఎవరి ద్వారా? 
జనశక్తి నేత కూరరాజన్న, ఆనంద్‌లకు పిస్టల్స్, వందలాది బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై పోలీసులను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల నుంచి జనశక్తి కూరరాజన్నకు ఎలాంటి సహకారం ఉండదని ఎస్‌ఐబీ అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులకు క్లారిటీ రావట్లేదు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌నుంచి రవాణా అయ్యాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఏ కొరియర్‌ తెస్తున్నాడు? ఏ రూపంలో వీటిని రవాణా చేస్తున్నారు? ఎంతకు వీటిని విక్రయిస్తున్నారన్న అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement