ప్రతిపక్షాల ‘మాటలు’ నమ్మొద్దు

 Harish Rao Road Show In Siddipet - Sakshi

సిద్దిపేటలో బీజేపీకి డిపాజిట్‌ గల్లంతే

బీజేపీకి ఇప్పుడున్న 5 సీట్లు కూడా రావు

సిద్దిపేటలో హరీశ్‌రావు రోడ్‌ షో

సిద్దిపేటజోన్‌: ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసిందని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిద్దిపేట విలీన గ్రామాలు నర్సాపూర్, హనుమాన్‌నగర్‌కు చెందిన వార్డుల్లో భారీ రోడ్‌ షో నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, మహిళలు రోడ్‌ షోలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయా సభల్లో మాట్లాడుతూ దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు తిరగబడుతున్నారని పేర్కొన్నారు. రైతులను విస్మరించిన బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేకత ఆరంభమైందన్నారు. మన రాష్ట్రంలో బీజేపీకి ఇప్పటివరకు ఉన్న ఐదు స్థానాలు కూడా ఈ ఎన్నికల్లో రావని జోస్యం చెప్పారు. సిద్దిపేటలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు.  

మీతో ముప్పై ఏళ్ల అనుబంధం
సిద్దిపేట ప్రజలతో తనకు ముప్పై ఏండ్ల అనుబంధం ఉందని, ప్రతి సారి ఎన్నికల్లో ప్రేమ, ఆప్యాయతతో ఆదరించి గెలిపించారని హరీశ్‌రావు అన్నారు. నేడు రోడ్‌షోలో మంగళహారతులతో ఘన స్వాగతం పలికిన మీ ప్రేమ, అభిమానానికి శిరస్సు వంచి దండం పెట్టుతున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కష్టపడి, పోరాడి, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై అనేక కేసులు నమోదు అయ్యాయని, వాటిలో కొన్నింటిని కొట్టివేయగా, నేటికి మరో 54 ఉద్యమ కేసులు తన మీద ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ కోసం రైల్‌రోకో, రాస్తారోకో చేయడం వల్ల కేసులు నమోదయ్యాయన్నారు. కొట్లాడి ధైర్యంగా తెలంగాణను తెచ్చుకున్న మనం అంతే ధైర్యంతో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సిద్దిపేటలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మెడికల్‌ కళాశాల, జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. పట్టణ శివారులో నిరుపేదల కోసం రెండు వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించామని, ఎన్నికల కోడ్‌ దృష్ట్యా పంపిణీ చేయలేకపోయామన్నారు. 

గతంలో వృద్ధులు కారు గుర్తుకు ఓటు వేయబోయి పొరపాటున ఆటోకు వేశారని, ఈ సారి అలాంటి బాధ ఉండబోదని, ఎన్నికల కమిషన్‌ ప్రతి అభ్యర్థి పేరు పక్కన ఫొటోలు ఈవీఎం బ్యాలెట్‌ పేపర్‌ ఉండేలా చర్యలు తీసుకుందన్నారు. ఓటు వేసేటపుడు పక్కన నా బొమ్మ చూసి కారు గుర్తుపై ఓటు వేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, అభివృద్ధిలో ముందున్న సిద్దిపేట రేపు ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో నంబర్‌ వన్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేసి తనను ఆశీర్వదించాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో ఎక్కువ బాధ్యతలు చేపట్టడం జరిగిందని, దాంతో బయట తిరగాల్సి వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు నా మెజారిటీ బాధ్యతను తీసుకొని ముందుండి నన్ను దీవించాలన్నారు. పండుగ ఉన్నా, ఆపద ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా పని చేశానన్నారు. వచ్చే వానా కాలం నాటికి కాళేశ్వరం నీటితో నర్సాపురం చెరువును నింపుతానన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు సముచితంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణు, బర్ల మల్లికార్జున్, చిన్నా, నర్సయ్య, సాకి బాల్‌లక్ష్మి ఆనంద్, మంతెన జ్యోతి, తాళ్లపల్లి లక్ష్మీసత్యనారాయణ, మామిండ్ల అయిలయ్య, నాయకులు కొండం సంపత్‌రెడ్డి, మెహన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top