పెళ్లింటా విషాదం.. | Grooms Brother Commit Suicide In Warangal | Sakshi
Sakshi News home page

పెళ్లింటా విషాదం..

Jun 22 2019 1:00 PM | Updated on Jun 22 2019 1:03 PM

Grooms Brother Commit Suicide In Warangal - Sakshi

రాధాకృష్ణ

సాక్షి, వరంగల్‌ : పెళ్లింట్లో విషాదం నెలకొంది. కొద్దిరోజుల్లో తమ్ముడి వివాహం నిర్వహించనుండగా సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్త జక్కుల రాధాకృష్ణ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని కోమటిపల్లి– చింతగట్టు మార్గమధ్యలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తించారు. ఈమేరకు స్థానికుల సమాచారం మేరకు కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా  మృతదేహం నుజ్జునుజ్జయి ఉంది. సమీపంలో నిలిపి ఉన్న  వాహనంతోపాటు మృతుడు ధరించిన షర్ట్‌ ఆధారంగా రాధాకృష్ణగా ధ్రువీకరించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన జక్కుల రాధాకృష్ణ (32) శ్రీఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. అతడు అవివాహితుడు.

రాధాకృష్ణకు రెండేళ్లుగా ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి సాక్షిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు పెళ్లి విషయమై రెండుమూడు సార్లు అమ్మాయితో మాట్లాడారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందా? లేదా..  అమ్మాయి తరఫువారు బెదిరించారా? అనే విషయమై మృతుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయే రాధాకృష్ణ మృతికి కారణమని ఆయన సోదరుడు  విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్‌పీ  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.

మరో ఐదు రోజుల్లో తమ్ముడి పెళ్లి..
ఈనెల 26న రాధాకృష్ణ చిన్న తమ్ముడి వివాహం నిశ్చియమైంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికలు కూడా చేరాయి. ఇంతలో రాధాకృష్ణ రైలు కింద పడి మృతి చెందాడనే సమాచారం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement