‘టాస్క్‌’ ఇచ్చి.. నైపుణ్యం పెంచి.. | Sakshi
Sakshi News home page

‘టాస్క్‌’ ఇచ్చి.. నైపుణ్యం పెంచి..

Published Sun, Nov 26 2017 2:07 AM

Government providing support to engineering students - Sakshi

హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన 22 ఏళ్ల కస్తుబ్‌ కౌండిన్య.. నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 2012–16 మధ్య మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతూ, టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాంలో చేరాడు. తన ఇద్దరు సహ విద్యార్థులు శ్రీకాంత్‌ కొమ్ముల, ఆనంద్‌ కుమార్‌లతో కలసి ‘జార్‌‡్ష ఇన్నొవేషన్స్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను స్థాపించారు. ఈ ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఎయిర్‌ కండిషన్డ్‌ హెల్మెట్‌కు ఎంతో ప్రాచుర్యం లభించింది.

స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం కింద వీరి పరిశ్రమ అత్యధికంగా 74 రకాల పన్నులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అధిక ఉష్ణోగ్రతల మధ్య మైనింగ్, చమురు, షిప్పింగ్, సిమెంట్‌ పరిశ్రమల్లో పని చేసే కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీరు ఆ హెల్మెట్‌ను రూపొందించారు. ఇందులో రెండు రకాల హెల్మెట్లు ఉండగా, ఒకసారి చార్జింగ్‌ చేస్తే 2 గంటలు, 8 గంటలు అవి పని చేస్తాయి. ఇదే కాన్సెప్ట్‌తో మోటార్‌ సైకిల్‌ చోదకుల కోసం ఎయిర్‌ కండిషన్డ్‌ హెల్మెట్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. 2019లో హెల్మెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కస్తుబ్‌ ‘సాక్షి’కి తెలిపారు.


సాక్షి, హైదరాబాద్‌: పరిశ్రమ ఎలా స్థాపించాలి, స్థాపించిన తర్వాత విజయవంతంగా ఎలా నడపాలి.. అనే అంశాలపై తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) సంస్థ సరైన అవగాహన, మార్గ నిర్దేశకత్వం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) సహకారంతో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం అనే రెండేళ్ల వ్యవధి గల సర్టిఫికెట్‌ కోర్సును అంది స్తోంది. కొత్త పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తి గల ఇంజనీరింగ్‌ మూడో ఏడాది విద్యార్థులు ఈ కోర్సు లో చేరేందుకు అర్హులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త ఆలోచనతో ఓ ప్రోడక్ట్‌ను రూపొందించడం, దాని ఉత్పత్తికి పరిశ్రమను స్థాపించడం, విజయవంతంగా మార్కెటింగ్‌ చేసి లాభాలు ఆర్జించేందుకు కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు అందిస్తున్నారు.

ఒప్పందంతో అందివచ్చిన అవకాశం
విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు టాస్క్‌ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుని పలు రకాల కోర్సులు అందిస్తోంది. ఈ క్రమంలో ఐఎస్‌బీతో ఎంఓయూ కుదుర్చుకుని 2014లో టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.

ఐఎస్‌బీలో ప్రవేశం పొందేందుకు ప్రవేశ పరీక్షలో తీవ్ర పోటీని ఎదుర్కొని సీటు సాధించడంతోపాటు కనీసం రూ.10 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి కేవలం రూ.8 వేలు చొప్పున రెండేళ్లలో రూ.16 వేలు చెల్లించి ఐఎస్‌బీ నుంచి టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగామ్‌ను పూర్తి చేసి సర్టిఫికెట్‌ పొందేందుకు రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ ఎంఓయూ ద్వారా అవకాశం కలిగింది. టాస్క్‌ ద్వారా ప్రభుత్వం ఐఎస్‌బీకి రూ.53 వేలు వరకు ఒక్కో విద్యార్థి తరఫున చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రూ.10 కోట్ల వరకు చెల్లించింది.

కఠోర పరి‘శ్రమ’ అవసరం
కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌తో బయటికి రావడం అత్యంత కఠోర శ్రమతో కూడిన పని అని టాస్క్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2014–16 మధ్య కాలంలో ఈ కోర్సులో 381 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేరగా, అందులో 41 శాతం మంది మాత్రమే విజయవంతంగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌ నుంచి నలుగురు విద్యార్థులు పరిశ్రమలను స్థాపించి తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఐఎస్‌బీలో నేర్చుకున్న పాఠాలు, అందిపుచ్చుకున్న విషయ పరిజ్ఞానం, సర్టిఫికెట్లతో మిగిలిన విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మక సంస్థల్లో కొలువు లు, ఉన్నత చదువుల సీట్లను పొందారని టాస్క్‌ సీఈఓ సుజీవ్‌ నాయర్‌ ‘సాక్షి’కి తెలిపారు. కోర్సులో చేరేందుకు ఇంజనీరింగ్‌లోని పది విభాగాల విద్యార్థులు అర్హులు. సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఏరో స్పేస్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఈసీఈ, ఈఈఈ, ఐటీ, మెకానికల్‌ బ్రాంచీలకు చెందిన 1,800 మందికి పైగా విద్యార్థులు ఇప్పటి వరకు ఈ కోర్సులో ప్రవేశం పొందగా, అందులో 36 శాతం మంది అమ్మాయిలు ఉండటం విశేషం.

నాలుగు సెమిస్టర్ల కార్యక్రమం
ఈ కోర్సు.. రెండేళ్ల కాల వ్యవధితో నాలుగు సెమిస్టర్లు ఉంటుంది. ఐఎస్‌బీ అధ్యాపకుల బృందం ఈ కోర్సులో చేరిన విద్యార్థుల కాలేజీలకు వెళ్లి వారికి పాఠాలు చెబుతుంది. ఐఎస్‌బీలో సైతం ఈ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు  కొత్త ప్రోడక్ట్‌కు నమూనా తయారు చేసేందుకు అధ్యాపకులు మార్గదర్శకత్వం వహిస్తారు.

విద్యార్థులు రూపొందించిన నమూనాలపై పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించి ప్రోడక్ట్‌కు తుది రూపు ఇచ్చేందుకు సహకరిస్తారు. ఇలా విజయవంతంగా ప్రోడక్ట్‌ నమూనాలకు రూపకల్పన చేసిన విద్యార్థులకు మాత్రమే ఐఎస్‌బీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. పరిశ్రమను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందించేందుకు టాస్క్‌ సహకరిస్తుంది.

Advertisement
Advertisement