ప్రశ్నించే గొంతుకనవుతాను 

Give One Chance To Me Ask  People Jeevan Reddy In MLC Elections At Nizamabad - Sakshi

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు

 కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి  

కామారెడ్డి క్రైం: తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఉద్యమించింది ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువత, పట్టభద్రులేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి కామారెడ్డికి విచ్చేశారు. బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.  

పొరుగు రాష్ట్రమైన ఏపీలో 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంతో పాటు రెండు డీఎస్సీలు కూడా వేసి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఇక్కడ ఒక్క డీఎస్సీ కూడా రాలేదన్నారు. చట్ట సభల్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రజావాణిని వినిపించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే అవకాశమన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, మేధావులు, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు.

16 మంది ఎంపీలు ఇంతకాలం ఏం చేశారు...  
రానున్న ఎన్నికల్లో 16 ఎంపీలను గెలిపించుకుంటే దేశ చరిత్రను మారుస్తమని కేటీఆర్‌ అనడం హాస్యస్పదమని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ విమర్శించారు. ఇప్పుడు కూడా 16 మంది ఎంపీలు ఉన్నా నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు.

పట్టభద్రులకు తీవ్ర అన్యాయం 
నిజామాబాద్‌అర్బన్‌ : తెలంగాణ  ఏర్పాటులో నిరుద్యోగ యువత ప్రధానపాత్ర అని, పట్టుభద్రులే ఉద్యోగాల భర్తీ లేక అనేక అవస్థలకు గురవుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ డీసీసీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంను నిలదీసే అవకాశం ఉంటుందన్నారు.

 రైతులపై కేసులు పెడుతారా...
కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుంటే కేసులు పెట్టి జైలులో పెట్టడం సమంజసంగా లేదని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. అసెంబ్లీలో రైతుల సమస్యలు, మద్దతు ధరపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీ మారడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి మధుగౌడ్‌ విమర్శించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు గెలిపించండి 
నిజామాబాద్‌ లీగల్‌(నిజామాబాద్‌ అర్బన్‌): రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి న్యాయవాదులను కోరారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణ బార్‌ చాంబర్‌లో ఆయన మాట్లాడారు. తన రాజకీయ గుర్తింపు న్యాయవాద సమాజంతోనేనని అన్నారు. జూనియర్‌ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో స్థిరపడేందుకు ప్రభుత్వ రాయితీలు కల్పించి ఆదుకోవాలన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, ఈరవత్రి అ నిల్‌కుమార్,  మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి,  పీసీసీ ఐటీసెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌రావు, కామారెడ్డి, నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు, మానాల మోహన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, నాయకులు తాహెర్‌బిన్,  మహేష్‌కుమార్‌గౌడ్, నగేష్‌రెడ్డి, పంచరెడ్డిచరణ్,  రాష్ట్ర బార్‌ కౌ న్సిల్‌ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, బార్‌ అధ్యక్షుడు శ్రీహరి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top