ఆడపిల్లలు తగ్గిపోతున్నారు!

Girls Ratio Decreased In Telangana - Sakshi

రాష్ట్రంలో వెయ్యి మంది మగ శిశువులకు 950 మందే..

గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ఆడపిల్లలు

అత్యంత తక్కువగా యాదాద్రి జిల్లాలో వెయ్యికి 850 మందే 

ఆడశిశువుల జననాల్లో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలు ఆదర్శం

ఖమ్మం జిల్లాలో 1,177 మంది, పెద్దపల్లిలో 1,012 మంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్‌ఎంఐఎస్‌ ద్వారా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే, ఈ ఆర్థిక సంవత్సరం (ఇప్పటివరకు)లో తేడా కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌) ఈ నెల దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తిని ప్రకటించింది. అప్పుడే పుట్టిన శిశువులను ఆధారం చేసుకొని ఈ నిష్పత్తిని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తి ప్రతీ వెయ్యి మగ శిశువులకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 932 మంది ఆడ శిశువులు జన్మించారు. అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 934 మంది ఆడ శిశువులు పుట్టారు. అదే కాలంలో తెలంగాణలో చూస్తే దేశ సగటు కంటే ఎక్కువే ఉన్నా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ సంఖ్య రాష్ట్రంలో తక్కువగా ఉండటం గమనార్హం. 2018–19లో తెలంగాణలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 957 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 950 మంది ఆడ శిశువులు జన్మించినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2017–18లో తెలంగాణలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి మరింత దారుణంగా ఉండేది. అప్పుడు ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 925 మంది మాత్రమే ఆడ శిశువులున్నారు. 2018–19లో మొత్తం 5,30,146 మంది పిల్లలు జన్మించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,82,097 మంది జన్మించినట్లు నివేదిక వివరించింది.
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా.. 
ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలు స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఆదర్శంగా ఉండటం విశేషం. ఖమ్మం జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 1,057 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆ సంఖ్య మరింతగా పెరిగి 1,177కు చేరుకోవడం విశేషం. ఇక పెద్దపల్లి జిల్లాలో వారి నిష్పత్తి 2018–19 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి మంది మగ శిశువులకు 1,031 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,012 ఉండటం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 885 మంది జన్మించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 850కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు తక్కువగా పుట్టిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. మిగిలిన జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఆడ శిశువుల నిష్పత్తి పెరిగింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కడుపులోనే ఉన్నప్పుడు స్కానింగ్‌ ద్వారా ఆడ శిశువులను ముందే గుర్తించి భ్రూణ హత్యలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు డాక్టర్లు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఈ విషయంలో డబ్బులకు కక్కుర్తిపడి ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంత చైతన్యం తెస్తున్నా ఈ విషయంలో కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఐదారేళ్లతో పోలిస్తే కొంచెం పరిస్థితి మారిందంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top