స్వచ్ఛమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమే లక్ష్యం

Published Wed, Mar 6 2019 10:56 AM

GHMC Target to Swach Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: స్వచ్ఛ నగరం సాధనే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. నూరు శాతం ఫలితాలు సాధించేందుకు మరో కొత్త కార్యక్రమానికి సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారంతో పాటు, అమలు పర్యవేక్షణ బాధ్యతలను ‘ఆస్కి’కి అప్పగించనుంది. నగరంలో నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాలు పంపిణీ చేసినా ఆశించిన మేర ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఆస్కి సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా చెత్తకు సంబంధించి ప్రజలకు తగిన సమాచారం, అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రవర్తనలోనూ మార్పు తేవాలని, దాన్ని ఒకరి నుంచి మరొకరికి విస్తృతంగా వ్యాప్తి చేయాలని భావిస్తోంది. దీన్నే ‘ఇన్ఫర్మేషన్‌ఎడ్యుకేషన్‌ అండ్‌ బిహేవియరల్‌ చేంజ్‌ కమ్యూనికేషన్‌’ (ఐఈసీ అండ్‌ బీసీసీ)గా వ్యవహరిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2018కి అనుగుణంగా దీన్ని అమలు చేసేందుకు ‘ఆస్కి’ తగు కార్యాచరణ రూపొందించనుంది.  ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్స్‌లో దేశంలో అగ్రస్థానం పొందిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో పాలుపంచుకున్న సంస్థల సేవలను సైతం వినియోగించుకోనుంది. దీంతోపాటు ఇప్పటికే దక్కించుకున్న ‘ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌’ను నిలబెట్టుకోవడం కూడా కార్యాచరణలో భాగంగా ఉంది. పారిశుధ్య సేవల సక్రమ నిర్వహణ, ఐఈసీ అండ్‌ బీసీసీ అమలు, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే వారి సామర్థ్యం పెంపు ఆస్కి కార్యాచరణలో ఉన్నాయి.  

తొలుత అమీర్‌పేట,సోమాజిగూడలో అమలు
ఐఈసీ అండ్‌ బీసీసీ అమలు కోసం స్థానిక ఎన్జీఓలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల వలంటీర్ల సేవలను వినియోగించుకుంటారు. ఈ గ్రూపులను స్వచ్ఛ వార్డు యాక్షన్‌ టీమ్‌(స్వాట్‌)గా వ్యవహరిస్తారు. పైలట్‌ ప్రాజెక్టుగా అమీర్‌పేట, సోమాజిగూడ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మూడునెలల పాటు అమలు చేస్తారు. క్రమేపీ ఏడాది చివరినాటికి 60 వార్డులకు విస్తిరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా ఆస్కిదే. ఇందుకు ఆస్కి ‘ఎకో ప్రో ఎన్విరాన్‌మెంటల్‌ సర్వీసెస్‌’, ‘బేసిక్స్‌ మున్సిపల్‌ వేస్ట్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ సేవలను వినియోగించుకుంటుంది. వీటికి స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉందని, ఇండోర్‌ వంటి నగరాల్లో వీటి సేవలను వినియోగించుకున్నట్టు సమాచారం. కార్యక్రమాల అమల్లో భాగంగా సదరు ఏజెన్సీలు కనీసం ఏడుగురు నిపుణులను నియమిస్తాయి. ఆర్నెళ్ల పాటు వారు తగిన ప్రణాళికతో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ మెరుగయ్యేందుకు తమ సేవలను వినియోగిస్తారు.

మూడు మాసాల్లో రెండు వార్డుల్లో తగిన ఫలితాలు కనిపించేలా కృషి చేస్తారు. ఇందులో భాగంగా ఇళ్ల వద్దే తడి, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలు వందశాతం వేరయ్యేలా చూస్తారు. నగరంలోని అన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షిస్తారు. ఇంకా పట్టణ పారిశుధ్యంపై ప్రజలకు తగిన అవగాహన, పారిశుధ్యానికి సంబంధించి ప్రజల వైఖరిలో మార్పు, రోడ్లపై ఎక్కడా చెత్త డబ్బా లేకుండా చేయడం, గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్ల ఎత్తివేత, పారిశుధ్య కార్మికుల పని సామర్థ్యం పెంపు, అధిక మొత్తాల్లోని చెత్త, డెబ్రిస్‌ వ్యర్థాల తరలింపులో నూతన విధానాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. గ్రేటర్‌లోని 150 వార్డుల్లోనూ స్వాట్‌ టీంలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అమలుకు బాధ్యత వహించేలా చేస్తారు.  మొత్తం రెండు దశల్లో ఈ కార్యక్రమాలను అమలు చేయాలనేది లక్ష్యం కాగా, తొలి ఆర్నెళ్లలో సాంకేతిక సహకారంతో పాటు 150 వార్డుల్లో ఐఈసీ అమలు చేస్తారు. వీటితో పాటు మూడునెలల పాటు రెండు వార్డుల్లో (సోమాజిగూడ, అమీర్‌పేట) పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement