గ్రేటర్‌ దుబారా!

GHMC Given Special Powers to Zonal Commissioner - Sakshi

జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లకు విస్తృత అధికారాలు

అభివృద్ధికి దోహదపడుతుందని సరికొత్త నిర్ణయం

వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం...

విచ్చలవిడిగా పెరిగిన ఖర్చులు  

పర్యవేక్షణ లేమి..నాణ్యతలో లోపం ఖజానాపై భారం

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో కింది స్థాయి నుంచి అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేందుకు జోనల్‌ కమిషనర్ల నిధుల మంజూరు అధికారాన్ని పెంచారు. అయితే ఈ పెంపుదల సత్ఫలితాలివ్వకపోగా దుబారా ఖర్చులకు దారితీస్తోందని విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. జోనల్‌కమిషనర్ల నిధుల మంజూరు పవర్‌ను రూ.20 లక్షల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పెంచుతూ కమిషనర్‌ తన అధికారాల్ని వారు కూడా వినియోగించుకునేలా బదలాయించారు. పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తుందని ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చర్య రానురాను వికటిస్తోంది. పనులు సత్వరమయ్యే సంగతటుంచి నిధుల ఖర్చు పెరిగిపోతోంది. దుబారా భారీగా జరుగుతోంది. గతంలో అధికారాలు ప్రధాన కార్యాలయం పరిధిలో ఉన్నప్పటి కంటే జోన్లకు విస్తృతంగా బదలాయించాక పారిశుధ్యం, రవాణా, జీవ వైవిధ్యం, విద్యుత్, ఎంటమాలజీ తదితర విభాగాల్లో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగినా..సదరు విభాగాల్లో  పరిస్థితులు మెరుగయ్యాయా అంటే అదీలేదు. ఇవి నిధుల మంజూరుకు సంబంధించిన విభాగాల పరిస్థితి కాగా, భవన నిర్మాణ అనుమతుల జారీకి సంబంధించిన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఐదంతస్తుల వరకు జోన్లకే అధికారాలు కట్టబెట్టాక అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయి. నివాస, వాణిజ్య భవనాలన్నింటి అనుమతుల జారీకి అక్కడే అధికారాలుండటంతో స్థానిక అధికారులు ఆడింది ఆటగా సాగుతోంది. అనుమతులకు తప్ప అధికారాల్ని అక్రమాల్ని నిరోధించేందుకు వినియోగించడం లేరు. 

జోనల్‌ కమిషనర్లకు అధికారాలు కట్టబెట్టినప్పటికీ..వారి దిగువ స్థాయిలో ఉండే అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. జోనల్‌ కమిషనర్లకు వివిధ బాధ్యతలుండటంతో అన్నింటిమీద దృష్టి సారించలేకపోతున్నారు. జోనల్‌ స్థాయిలో సదరు పనుల పర్యవేక్షణకు, క్రాస్‌ చెకింగ్‌కు జాయింట్‌ కమిషనర్‌ స్థాయిలో మరొకరుంటే వారా పనులు చేసేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోనల్‌ కమిషనర్లకు రూ.2 కోట్ల వరకు అధికారం..నెలకు గరిష్టంగా రూ.8 కోట్ల వరకు వెరసి ఏడాదికి రూ.96 కోట్ల వరకు అధికారాలు దఖలు పడటంతో ఇక ప్రధాన కార్యాలయం నుంచి చేసే పనులేముంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో ప్రధాన కార్యాలయంలోని పలువురు అడిషనల్‌ కమిషనర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు పారిశుధ్యం, విద్యుత్, ఎంటమాలజీ, వెటర్నరీ తదితర విభాగాల అడిషనల్‌ కమిషనర్లకు చేసేందుకు చేతినిండా పనిలేకుండా పోయిందని చెబుతున్నారు. జోన్లలోనే నిధుల మంజూరు, పనులు చేసే అధికారాలుండటంతో  ఆయా విభాగాల అడిషనల్‌ కమిషనర్ల ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. జోనల్‌ స్థాయిలోనే నిధుల అధికారంతో  పనులు డబ్లింగ్‌ అవుతున్నాయి.  ఉదాహరణకు రూ. 5 భోజన కేంద్రాలను ప్రయోగాత్మకంగా జోన్‌కు 10 వంతున  ఆధునీకరించేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

వాటికి నిధులను మంజూరు చేయకముందే, ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే కొన్ని జోన్లలో స్థానిక అధికారులు ఎవరికి వారుగా ఆధునీకరణ పనులు ఇప్పటికే చేపట్టారు. జోనల్‌ స్థాయిలో పెరిగిన మంజూరు అధికారంతో ఇలా ప్రధాన కార్యాలయానికి..జోన్లు/సర్కిళ్లకు మధ్య సమన్వయం లేకుండా పోతోంది. మరోవైపు జోనల్‌ స్థాయిలోనే పనులన్నీ చేస్తుండటంతో ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో.. నాణ్యత ఏ మేరకు ఉంటుందో.. పనులెక్కడ కుంటుపడుతున్నాయో ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు తెలియడం లేదు. ఇంజినీరింగ్‌ పనులకు సంబంధించి నెలకోమారు  ఎన్ని పనులు మంజూరైంది.. ఎన్ని పనులు ప్రారంభించారు  వంటి వివరాల సంఖ్య మాత్రం ప్రధాన కార్యాలయానికి మొక్కుబడిగా పంపుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో ఏపనులు జరుగుతున్నాయో..నత్తనడకన సాగితే కారణాలేమిటో.. నాణ్యత  ఎలా ఉందో ఉన్నతాధికారులకు తెలియకపోవడంతో వాటి విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. గతంలో సర్కిల్,జోన్ల స్థాయిలోజరిగే పనుల గురించి ప్రధాన కార్యాలయంలోని చీఫ్‌ఇంజినీర్లకు తెలిసేది.. ఎక్కడైనా సమస్యలొస్తే వెంటనే పరిష్కరించేవారు. నాణ్యతపైనా ప్రశ్నించేవారు. ప్రస్తుతమా పరిస్థితి లేదు. అలాగే గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో ఆయా మార్గాల్లో ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేపట్టారు. అవన్నీ జోన్లస్థాయిలోనే చేశారు. ఇక వీధిదీపాలకు సంబంధించి పనులన్నీ ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించారు. ప్రధాన కార్యాలయంలోని ఆ విభాగం  అడిషనల్‌ కమిషనర్‌ ఇక ఏం పనులు చేయాలో సంబంధిత అధికారులకే తెలియాలి. ఇలా ఓవైపు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు చేతినిండా పనులు లేక..జోన్లస్థాయిలో పర్యవేక్షణ లేక.. నిధుల దుబారా జరుగుతుండటంతో.. జోన్లకు అధికారాల వికేంద్రీకరణతోపాటు అందుకు తగ్గట్లు క్రాస్‌చెకింగ్‌.. అజమాయిషీ వంటివి ప్రధాన కార్యాలయం నుంచి ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

నామినేషన్‌ పనులు పెరిగే ప్రమాదం..
ఇక జోన్లకే కోట్లాది రూపాయల  నిధుల మంజూరు అధికారం ఇవ్వడంతో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వారికి ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. లక్ష రూపాయల వరకు పనుల్ని నామినేషన్‌ మీద ఇచ్చేందుకు ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని జోనల్‌ కమిషనర్లు  లెక్కకు మిక్కిలిగా నామినేషన్‌ మీద ఇచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. నామినేషన్‌ పనులంటేనే  నిధులు కుమ్మరించడమే అనే అభిప్రాయాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నామినేష¯Œన్‌ మీద పనుల్ని రద్దు చేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top