మనీ మోర్‌ మనీ | GHMC Focus on Property Tax Collections | Sakshi
Sakshi News home page

మనీ మోర్‌ మనీ

Sep 21 2019 9:20 AM | Updated on Sep 27 2019 1:42 PM

GHMC Focus on Property Tax Collections - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు సర్వేల ద్వారా అండర్‌ అసెస్డ్, అన్‌అసెస్డ్‌ భవనాలను గుర్తిస్తోంది. ఇటీవల మూసాపేటలో నిర్వహించిన శాటిలైట్‌ ఆధారిత 2డీ సర్వేతో ఒక్క సర్కిల్‌లోనే ఆదాయం గణనీయంగా పెరగడంతో గ్రేటర్‌ వ్యాప్తంగానూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మూసాపేట సర్కిల్‌లో మొత్తం 30వేల ఇళ్లకు గాను 9వేల ఇళ్లు ఆస్తిపన్ను రాయితీలోనివి ఉండగా... 6వేల ఇళ్లు ఆస్తిపన్ను జాబితాలోనే లేవు. వాస్తవ విలువ కంటే తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నవి దాదాపు 3వేల   ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి సర్వేతో బెంగళూర్‌లో ఆస్తిపన్ను ఏకంగా రూ.1,080 కోట్లు పెరగడాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీకి వివిధ పనుల కోసం నెలకు సగటున దాదాపు రూ.147 కోట్లు ఖర్చవుతుండగా... ఆదాయం మాత్రం దాదాపు రూ.110 కోట్లు ఉంటోంది. మిగతా మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకోవాలని, ట్రేడ్‌ లైసెన్సు లేని వ్యాపారుల నుంచి వసూళ్లు  తదితర చర్యలకు సిద్ధమవుతోంది. వీటి ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల రూ.5లక్షల కంటే ఎక్కువ ఆస్తిపన్ను ఉన్న వాణిజ్య భవనాల తనిఖీ చేపట్టగా దాదాపు రూ.9 కోట్లు అదనంగా పెరిగింది. అదనపు అంతస్తులు తదితరమైనవి గుర్తిస్తే మరింత ఆదాయం పెరగనుంది. ఓవైపు ఆదాయం పెంచుకోవడంతో పాటు మరోవైపు ఎస్సార్‌డీపీలో భాగంగా జరుగుతున్న పనుల్లో భూసేకరణను వేగవంతం చేసేందుకు కూడా బల్దియా ప్రణాళిక రచిస్తోంది. వీటికి చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు రూపేణా కాకుండా వీలైనంత మేరకు టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇటీవల కాలంలో ఈ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు పెరగడంతో అధికారులు ఈ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎల్‌బీనగర్‌ పరిసరాల్లో ఎస్సార్‌డీపీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేసేందుకు భూ యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో నివాస భవనాలు వాణిజ్య భవనాలుగా మారడంతో వాటిని కమర్షియల్‌ కారిడార్లుగా గుర్తించి ఇంపాక్ట్‌ ఫీజు వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో జీవో రానుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఆర్కిటెక్ట్‌ల ప్రమేయం తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. త్వరలో రూపొందించనున్న జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. 

రోడ్ల మరమ్మతుల బాధ్యత బల్దియాదే...
నగరంలో రోడ్లు వివిధ సంస్థలకు చెందినవి ఉన్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఆర్‌డీసీఎల్, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీల రోడ్లున్నాయి. రోడ్లు ఎవరివైనా వర్షాకాలం ముగిసేంత వరకు ఏర్పడే మరమ్మతుల బాధ్యత జీహెచ్‌ఎంసీనే చేపట్టాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు తగిన యంత్రాంగం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement