కోపంతో ‘కేటీఆర్‌-ఇవాంక రోడ్డు’ | Frustrated Residents Construct KTR Ivanka Road in Hyderabad | Sakshi
Sakshi News home page

May 1 2018 12:22 PM | Updated on Aug 30 2018 5:49 PM

Frustrated Residents Construct KTR Ivanka Road in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం పట్టించుకోలేదు. విజ్ఞప్తులను నేతలు పెడ చెవిన పెట్టేసిండ్రు. అధికారులేమో నిర్లక్ష్యపు సమాధానాలిచ్చారు. విసిగిపోయిన జనాలు ఆ కోపంలో తమ దారి తామే చూ(వే)సుకున్నరు. విశ్వనగరంలోని మారేడ్‌పల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవి. గతుకుల రోడ్లను తమంత తామే బాగు చేసుకున్నారు. చివరకు దానికి పేరు కూడా పెట్టేశారు.

విజ్ఞప్తులు పట్టించుకోలేదు... కొంత కాలంగా రోడ్ల అధ్వానపరిస్థితి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదు. గతేడాది ఇవాంక ట్రంప్‌-ప్రధాని మోదీ రాకల సందర్భంగా నగరానికి మరమ్మత్తులు జరిగింది తెలిసిందే. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీకి పలువురు స్థానికులు మళ్లీ విజ్ఞప్తులు చేశారు. బదులుగా ‘ఆమె(ఇవాంక) మీ ప్రాంతంలోకి రావట్లేదు కదా’ అన్న నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని స్థానికులు ఆరోపించారు. ఇంకోపక్క ‘ఇవాంక ఈ వంక రావమ్మా!’ అంటూ సోషల్‌ మీడియాలో అప్పుడు చిన్నపాటి ఉద్యమం కూడా నడిచింది. అదే సమయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం కృష్ణాంక్‌ ఆధ్వర్యంలో స్థానికులు ఫ్లకార్డ్‌లతో ధర్నా కూడా నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

విసిగిపోయి చివరకు... రోజులు గడుస్తున్నాయి. ఇవాంక ఆవైపు రాలేదు.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీంతో ప్రజలే రంగంలోకి దిగారు. వాళ్లకు కావాల్సిందాన్ని పూర్తి చేసుకున్నారు. కొందరు స్థానికులు స్వచ్ఛందంగా తట్ట చేతబట్టి మట్టితో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేసుకున్నారు.  అంతా అయ్యాక చివరకు ఆ రోడ్డుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ పేర్లు కలిపి పెట్టేశారు.  ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా తాము ఈ పని చేసినట్లు వారు చెబుతున్నారు. ‘కేటీఆర్‌-ఇవాంక ట్రంప్‌ రోడ్డు’ అని నామకరణం చేసినట్లు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘మారేడ్‌పల్లి డేస్‌’ ఫేస్‌బుక్‌ పేజీలో ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు చేసిన పనిని అభినందిస్తున్న కొందరు.. ప్రభుత్వాలు పని చేయనప్పుడు ప్రజలే ఇలా రంగంలోకి దిగాల్సి వస్తుందని ఇంకొందరు.. మిగతా ప్రాంత ప్రజలు కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement