భార్యాపిల్లలతో వస్తూ.. | Father, son killed in road accident | Sakshi
Sakshi News home page

భార్యాపిల్లలతో వస్తూ..

May 14 2015 11:57 PM | Updated on Sep 2 2018 4:41 PM

అతడో చిరుద్యోగి.. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు.

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడి
 దుర్మరణం
 భార్య, కుమార్తెకు తీవ్రగాయాలు
 చిన్నారి పరిస్థితి విషమం..
 ఆస్పత్రికి తరలింపు
 కొరటికల్ శివారులో

 
 బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్
 అతడో చిరుద్యోగి.. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు. రెండు గంటలు అక్కడే గడిపాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు..మరో పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఆ కుటుంబానికి మార్గమధ్యలో అనుకోని ఆపద ఎదురైంది. రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న టిప్పర్ రివర్స్‌లో వస్తూ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు దుర్మరణం పాలవ్వగా, భార్యా కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. మునుగోడు మండలం కొరటికల్ గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు..
 - మునుగోడు
 
 మండలంలోని గూడపూర్ గ్రామానికి చెందిన దేశిడి నర్సింహ్మ(38) స్థానిక సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య లలిత, కుమారుడు అర్జున్‌సింగ్(7) కుమారై వైశాలి ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో లలిత కనగల్ మండలం జీయడవల్లి గ్రామమైన తన పుట్టింటికి పిల్ల తో కలిసి వెళ్లింది. వారిని తీసుకువచ్చేందుకు గురువారం నర్సింహ తన బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు.
 
 టిప్పర్ డ్రైవర్ గమనించకుండా..
 అత్తవారి ఇంట్లో మధ్యాహ్నం వరకు ఉన్న నర్సింహ అనంతరం తన భార్యా పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కొరటికల్ గ్రామశివారులోని రెండొవ మూలమలుపు వద్ద రోడ్డు మరమ్మతులు జరుగుతున్న విషయాన్ని నర్సింహ గమనించి బైక్‌ను నిలిపాడు. అయితే డాంబర్‌ను రోడ్డుకు మరమ్మతులు చేసే యంత్రంలో పోసేందుకు రివర్స్‌లో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వెనుక ఉన్న బైక్‌ను గమనించలేదు. అలాగే టిప్పర్‌ను వెనుకకు తీసుకరావడంతో ప్రమాదం జరిగింది. టిప్పర్ టైర్లు బైక్‌పై ఉన్న నర్సింహ, అతడి కుమారుడు అర్జున్‌సింగ్‌పై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
 
  అయితే అప్పటికే బైక్ దిగిన లలిత ప్రమాదాన్ని పసిగట్టి బైక్‌పై ఉన్న తన కూతురిని పక్కకు లాగేసే క్రమంలో వారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి వైశాలి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. అయితే టిప్పర్ వాహనానికి క్లినర్ ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున ఎస్‌ఐ డానియల్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల ను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలి పారు. కాగా, మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని రాత్రి బంధు వులు గూడపూర్‌లో రాస్తారోకో నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement