గోప్యత డొల్లేనా!

Facebook Portal home video device could be used to collect data and target ads - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ ఇటీవల ‘పోర్టల్‌’గాడ్జెట్‌ ప్రవేశపెట్టింది.. వీడియో కాలింగ్‌ కోసం వినియోగిస్తారు దీన్ని.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఎన్నో ప్రత్యేకతలు.. ఎన్నో వివాదాలు కూడా.. ఇంతకీ ఈ పోర్టల్‌ ఏమిటి? దాని వెనుక ఉన్న వివాదం ఏంటి..? మీరెప్పుడైనా వీడియో కాల్‌ చేశారా? చేసే ఉంటారులెండి. దీంతో చిక్కేమిటంటే.. వీడియో కెమెరా స్థిరంగా ఉంటుంది. పక్కన ఉన్నవాళ్ల మాట వినిపిస్తుందేమో గానీ.. ముఖం మాత్రం కనపడదు. ఇంకా బోలెడన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ తాము ‘పోర్టల్‌’తో చెక్‌ పెట్టామని ఫేస్‌బుక్‌ వారం రోజుల కింద ప్రకటించింది. ఓ ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, 360 డిగ్రీ కెమెరా.. అలెక్సా లాంటి పర్సనల్‌ అసిస్టెంట్‌లతో తయారైన ఈ సూపర్‌ గాడ్జెట్‌లో ప్రత్యేకతలు ఎన్ని ఉన్నా.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఒకే కారణంతో వివాదం మొదలైంది. 

ఎన్నో ప్రత్యేకతలు..
వీడియో కాలింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓ గాడ్జెట్‌ తయారు కావడం పోర్టల్‌ మొదటి ప్రత్యేకత అని చెప్పాలి. ఇంట్లో ఓ మూలన ఇది ఉందనుకోండి. ఇంటర్నెట్‌ ఆధారంగా ఎవరికైనా వీడియోకాల్‌ చేయొచ్చు. కృత్రిమ మేధతో పనిచేసే వీడియో కెమెరా ఉండటం వల్ల కాల్‌ నాణ్యత బాగా ఉండటంతో పాటు జూమ్‌ ఇన్‌.. జూమ్‌ అవుట్‌లు కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించి కెమెరాను వారి వైపు ఫోకస్‌ చేయడం.. వ్యక్తులు కదిలితే అందుకు తగ్గట్టు కెమెరా యాంగిల్‌ మార్చడం వంటివన్నీ పోర్టల్‌ ప్రత్యేకతల్లో కొన్ని. ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటేమో 15 అంగుళాల స్క్రీన్‌ ఉన్న ట్యాబ్లెట్‌తో కూడుకున్నదైతే.. రెండోది 10 అంగుళాల స్క్రీన్‌ సైజు ఉండేది. రెండింటిలోనూ అలెక్సా వర్చువల్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. చిన్నదాని ఖరీదు 200 డాలర్లు కాగా.. కొన్ని అదనపు ఫీచర్లున్న పెద్దసైజు పోర్టల్‌ రెట్టింపు ధర పలుకుతోంది.  

ఇదీ వివాదం..
ఫేస్‌బుక్‌ ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించడం.. దాన్ని మార్కెటింగ్‌ సంస్థలకు అమ్ముకోవడం ఫేస్‌బుక్‌ చాలాకాలంగా చేస్తున్న పనే. ఈ కారణంగానే మనం ఏదైనా ఒక పోస్ట్‌ లేదా ప్రకటనపై క్లిక్‌ చేస్తే చాలు.. కొంత సమయం వరకూ ఆ ప్రకటన, పోస్టులోని అంశాల ప్రకటనలే కనిపిస్తుంటాయి. వ్యక్తిగత అభిరుచులను గుర్తించి వాటికి అనుగుణమైన ప్రకటనలు గుప్పించడమూ ఫేస్‌బుక్‌ చాలాకాలంగా చేస్తోంది. ఇలా వినియోగదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇతర దేశాల ప్రభావం పడిందన్న ఆరోపణలు రావడం.. ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ అమెరికా ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడం ఇటీవలి పరిణామాలే. అయితే ఆ తర్వాత అయినా ఫేస్‌బుక్‌ తన పద్ధతులు మార్చుకుంటుందని ఆశించారు.

పోర్టల్‌ ద్వారా తాము సమాచారం సేకరించబోమని ఆ సంస్థ కూడా నమ్మబలికింది. అయితే వారం రోజులు గడిచాయో లేదో.. అసలు విషయం బయటకు వచ్చేసింది. కొన్ని వెబ్‌సైట్లు పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పోర్టల్‌ ద్వారా కూడా సమాచార సేకరణ సాధ్యమేనని పరోక్షంగానైనా అంగీకరించింది. వీడియో కాల్‌ ఎంత సేపు నడిచింది.. ఎవరికి ఎవరు ఎన్నిసార్లు వీడియో కాల్‌ చేశారు.. అలెక్సా సాయంతో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు? ఉపయోగించిన యాప్‌లు ఎలాంటివి.. వంటి వివరాలను సేకరించే సామర్థ్యం పోర్టల్‌కు ఉందని ఫేస్‌బుక్‌ అంగీకరించింది. ప్రస్తుతానికి తాము ఈ అంశాన్ని ప్రకటనల కోసం వాడట్లేదని తెలిపింది. వాట్సాప్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ సిద్ధం చేసిన చాటింగ్‌ అప్లికేషన్‌ ‘మెసెంజర్‌’ప్లాట్‌ఫారంపైనే పోర్టల్‌ కూడా పనిచేస్తుందని వివరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top