జూలు విదిలించిన ఎక్సైజ్ అధికారులు | Excise Officials raid on Vikarabad rural areas | Sakshi
Sakshi News home page

జూలు విదిలించిన ఎక్సైజ్ అధికారులు

Aug 21 2015 7:00 PM | Updated on Sep 5 2018 8:43 PM

ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు ఉన్న ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా జూలు విదిలించారు.

వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి) : ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు ఉన్న ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా జూలు విదిలించారు. గురువారం రాత్రి నుంచి ధన్నారం తండా, అనంతగిరిపల్లి, బురాంతపల్లి తండా, మన్నెగూడ తండాల్లో అక్రమ సారా తయారీదారులపై దాడులు నిర్వహించారు. గురువారం రాత్రి ఎక్సైజ్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. తండాకు చేరుకున్న ఎక్సైజ్ అధికారులను చూసిన తండా వాసులు ఏకంగా రాళ్ల వర్షం కురిపించారు. ఆ రాత్రిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియక ఎక్సైజ్ పోలీసులు వెనుదిరిగారు. కాగా శుక్రవారం ఉదయం లేవగానే తండాకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులు సీఐ సుధాకర్, ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి ఇంటినీ క్షుణంగా పరిశీలించారు. తండాలో పాడుబడ్డ ఇళ్లల్లో భూమిలో పాతి పెట్టిన బెల్లం ఊటలను పసిగట్టి వాటిని ధ్వంసం చేశారు. అందులో ఉన్న 750 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి సామాన్లను బయట పడవేశారు.

దీంతో తండా వాసులంతా ఒక్కసారిగా ఒక్కదగ్గరకు చేరుకుని ఎక్సైజ్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 'మీరు ఇలా చేస్తే మేము ఏమి చేయాలని, మా పిల్లలు ఎలా చదువుకుంటారని' పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీనికి పోలీసులు సమాధానం ఇస్తూ.. 'తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం. అయినా మీరు సారా అమ్మి పిల్లలను చదివించుకుంటామని అనడం సరైన పద్దతి కాదు. ఎలాంటి లైసెన్సులు లేకుండా అక్రమంగా తయారుచేసి విక్రయిస్తున్నారు.. దీని వల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని, వారిపై కేసులు నమోదు అయితే మీరు ఇంతకాలం కష్టపడి చదివించిన చదువు వృథా అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని' వారికి అర్థమయ్యే విధంగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement