ఎక్సైజ్‌ డేగ కన్ను

Excise Department Surveillance On Elections Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గుడుం బా సరఫరాపై ఎక్సైజ్‌ శాఖ దాడులు ముమ్మరం చేసింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులోకి రావడంతో  నిఘా పటిష్టం చేశారు. జిల్లాలో మొ త్తం 58 వైన్స్‌ షాపులుండగా వర్ధన్నపేట పరిధిలో 14, నర్సంపేట పరిధిలో 22, పరకాల పరిధిలో 22 వైన్స్‌ షాపులున్నాయి. జిల్లాలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూడు, ఎలైట్‌ బార్‌లు 5 ఉన్నాయి. ఇవేగాక బెల్ట్‌షాప్‌ల ద్వారా  అక్రమంగా మధ్యం విక్రయాలు సాగుతుండటంతో నిఘా తీవ్రతరం చేశారు.

మరోవైపు నాటుసారా తయారీ విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సందర్భంగా మధ్యంతో ప్రలోభాలకు గురిచేస్తారనే కారణంతో ఎక్సైజ్‌ శాఖ వైన్స్‌ల్లో అమ్మకాల పై దృష్టి పెట్టింది. మద్యం అక్రమనిల్వలపై జిల్లాలో నాలుగు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా రౌండ్‌ ద క్లాక్‌  సిబ్బంది అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకోనున్నారు. ప్రతిరోజు జిల్లాలోని మద్యం షాపులకు ఎంత మద్యం సరఫరా అవుతుందనే వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి అందిస్తున్నారు.

కంట్రోల్‌ రూంలు
జిల్లాలో ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయాలు, జిల్లా సూపరింటెండెంట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూంలు 24 గంటలు పని చేస్తాయి. ఒక్కో కంట్రోల్‌ రూంలో ఇద్దరు సిబ్బంది చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి ఫోన్‌లో స్వీకరించి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

ఆ ఫిర్యాదుదారుడికి ఎక్సైజ్‌ శాఖ తీసుకునే చర్యలపై మళ్లీ తెలియజేస్తారు. ఫిర్యాదుదారులు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌(0870–2977555,  9440902758), టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004252523తోపాటు 9440902663(నర్సంపేట),  9440902667(పరకాల), 9440902657(వర్ధన్నపేట) నంబర్లు కేటాయించారు.

అక్రమంగా మద్యం నిల్వ చేస్తే సమాచారమివ్వండి
ఎక్కడైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి ఉన్నట్లు తెలిస్తే వెంటనే సమాచారమివ్వండి. మేం అక్కడికి చేరుకుని చర్యలు తీసుకుంటాం. ఒక్కొక్కరు ఆరు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోరాదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటాం. వైన్స్‌ సమయపాలన పాటించాలి. – శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top