
ప్రోత్సహించేందుకే ‘విశిష్ట’ పురస్కారాలు
‘మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం తగ్గింది.
►విశిష్ట మహిళలకు పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో తుమ్మల
►24 మందికి సత్కారం.. ఒక్కొక్కరికీ రూ.లక్ష నగదు బహుమతి
హైదరాబాద్: ‘మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం తగ్గింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అపరిమితంగా నిధులు కేటాయిస్తూ పథకాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మహిళల ముఖాల్లో చిరునవ్వును చూసేం దుకు ఆయన సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. స్త్రీల రక్షణ కోసం షీ బృందాలు, వారి అభ్యున్నతి కోసం సంక్షేమ కార్యక్ర మాలు చేపడుతున్నారు. మహిళలను మరింత ప్రోత్సహించేందుకు విశిష్ట పురస్కారాలు తీసుకొచ్చారు’అని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం లలిత కళాతోరణంలో విశిష్ట మహిళలకు పురస్కారాల ప్రధాన కార్యక్రమం నిర్వహించింది. శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో తాత్సారం చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మహిళలు, శిశువుల కోసం నిధుల్లో పరిమితులు లేకుండా సంతృప్తకర స్థాయిలో పథకాలు అమలు చేయాలని నిశ్చయించిందని చెప్పారు. మహిళలను గౌరవిస్తేనే ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందన్నారు.
ప్రతి జిల్లాలో మహిళా భరోసా కేంద్రాలు: నాయిని
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం నగరంలో నూరు షీ టీమ్‌లు నిరంతరంగా పనిచేస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మరో వంద బృందాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో మహిళలు పూర్తిస్వేచ్ఛతో తమ సమస్యలు పంచుకుని పరిష్కరించుకోవచ్చని సూచించారు.
అవకాశమిస్తే సత్తా చాటుతారు: కవిత
ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మహిళలు అత్యంత ప్రతిభావంతులని, ఒక్క అవకాశం ఇస్తే సత్తా చాటుతారని, వారికి అవకాశాలు కల్పించాలని మగవారిని, ప్రభు త్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, విద్య, వైద్యం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యాభి వృద్ధిలో భాగంగా విస్తృత స్థాయిలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని, ఇప్పటి వరకు ప్రారంభించిన 600 గురుకులాల్లో సగం బాలికలవే ఉన్నాయని అన్నారు. ఇంటర్ తర్వాత పేద బాలికలు విద్యాభ్యాసం కొనసాగించేందుకు 26 రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు రూ.12 వేల విలువైన కిట్‌ను అందిస్తు న్నామని, ఆడబిడ్డకు జన్మనిస్తే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తున్నామన్నారు.
తాగు నీటి కష్టాలను అరికట్టేందుకు రూ.25 వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టు మొదలు పెట్టామన్నారు. అనంతరం విశిష్ట మహిళలు గా ఎంపికైన 24 మందిని సత్కరించారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా మహిళల సమ స్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో స్త్రీ పాత్ర తదితర అంశాలపై తెలంగాణ సాంస్కృతిక సారథులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.