ఎన్నికల నిర్వహణపై పోలీస్‌ సిబ్బందికి శిక్షణ

Election Conducting Training To Telangana Police - Sakshi

ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై ఈసీ అవగాహన

ఓటర్ల చైతన్యంపై కార్యక్రమాలకు సూచనలు

సువిధ, సీ–విజిల్‌ యాప్‌ల పనితీరుపై కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అధికారులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలకు ఈసీ అధికారులు అవగాహన కల్పించారు. ఇక దశల వారీగా కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 

డీఎస్పీల నుంచి ఎస్‌ఐల వరకు... 
జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్లు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఈసీ అధికారులు వీవీ ప్యాట్స్, ఈవీఎంల పనితీరుపై ప్రత్యేకం గా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ కల్పించనున్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యవహారాలను ఏ విధంగా అడ్డుకోవాలి, ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, ప్రచార రథాల అనుమతుల తదితరాలపై నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అంశాలను అధికారులకు వివరించనున్నారు. ఇకపోతే రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి ఈసీ తయారుచేసిన సువిధ యాప్‌ ద్వారా ఎలా తీసుకోవాలి.. వాటికి సంబంధించిన తదితరాలపై అవగాహన కల్పించబోతున్నారు.

సీ–విజిల్‌పై ప్రత్యేక శిక్షణ.. 
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు పంచే బహుమతులు, కూపన్లు, మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఈసీ రూపొందించిన ప్రత్యేక కార్యాచరణపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇకపోతే అభ్యర్థుల ప్రలోభాలపై నేరుగా ఓటర్లే ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన సీ–విజిల్‌ యాప్‌ పనితీరుపైనా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ యాప్‌ ద్వారా డబ్బులు పంచే వీడియోలు, మద్యం పంపిణీ తదితరాలన్నింటిపై ఓటర్లు నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా, రౌడీషీటర్ల బైండోవర్, లైసెన్సు ఆయుధాల డిపాజిట్‌ తదితరాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేలా ఆదే శించబోతున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top