ఒంటి గంటకల్లా పూర్తి ఫలితాలు : రజత్‌కుమార్‌

EC CEO Rajat Kumar Press Meet Over Telangana Assembly Results Preparations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుడనున్న నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 43 కేంద్రాల్లో కౌంటింగ్‌ ఉంటుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 14 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఉంటాయన్న రజత్‌ కుమార్‌... మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం ఒంటి వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 42 రౌండ్లు, బెల్లంపల్లిలో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్‌ ఉంటుందన్నారు.

అక్కడ మాత్రమే వీవీప్యాట్ల లెక్కింపు
కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తామని రజత్‌కుమార్‌ తెలిపారు. అన్ని చోట్ల వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం కుదరని, కేవలం అత్యవసరమైన చోట్ల మాత్రమే ఇందుకు అనుమతినిస్తామని పేర్కొన్నారు. ప్రతీ రౌండు పూర్తైన తర్వాత అభ్యర్థులకు చూపించే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా కౌంటింగ్‌ కొనసాగేందుకు లైవ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

మొబైల్‌ ఫోన్లు వద్దు
ఎలక‌్షన్‌ ఏజెంట్లకు కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని రజత్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేదాకా బయటికి వెళ్లకూడదని చెప్పారు. మొబైలు ఫోన్లు, కాలిక్యులేటర్లు తీసుకువస్తే నేరంగా పరిగణిస్తామని, పెన్నులు మాత్రం తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విలేకరులు కూడా కౌంటింగ్‌ కేంద్రం లోపలికి రావచ్చని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top