డిజిటల్‌ వైపు జీపీలు

E Governance In Grama Panchayat At Telangana - Sakshi

సాక్షి, జనగామ: గ్రామ పాలనను మరింత జవాబుదారీతనంగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీల్లో డిజిటల్‌ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఇ–గవర్నెన్స్‌ అమలు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారానే పంచాయతీల్లోని పనులను నిర్వహించనున్నారు. డిజిటల్‌ సేవలపై ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో 20 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

చేతి రాతకు చెల్లు చీటీ
గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు పర్చుతోంది. అందులో భాగంగా పంచాయతీ రాజ్‌ చట్టం–2018ను అమలులోకి తీసుకొచ్చింది. 500 జనాభా కలిగిన గిరిజన తండాతోపాటు శివారు గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శిని సైతం నియమించింది. ఇక పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మ్యానువల్‌ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇ–గవర్నెన్స్‌ అమలులో భాగంగా డిజిటల్‌ సేవలను అమలు చేయనున్నారు. గ్రామ పంచాయతీ నుంచి పొందే ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌ నుంచే తీసుకునే విధంగా చర్యలను ప్రారంభించారు. ఇక నుంచి ఇ–పంచాయతీ అప్లికేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, పేరు మార్పిడి, లైసెన్సుల జారీ, ఇంటి పన్ను వసూళ్లు, లే–అవుట్‌ అనుమతులు అన్నీ ఆన్‌లైన్‌ ద్వారా జారీచేస్తారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయనున్నారు.

ఆన్‌లైన్‌లోనే చెక్‌లు..
గ్రామ పంచాయతీలో రాత చెక్కులకు స్వస్తి చెప్పనున్నారు. పాత చెక్కుల విధానానికి చెక్‌పెట్టి పూర్తి పారదర్శకతతో చెక్కులను అందించడానికి డిజిటల్‌ కీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పాత విధానంతో గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే భావనతో ఈ దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఇది వరకు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులను చెక్‌ రూపంలో చెల్లించే వారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన చెక్‌ను ట్రెజరీ ద్వారా బ్యాంకుకు పంపించేది. అన్నీ సరి చూసుకున్న తరువాత బ్యాంకు ద్వారా నగదు విడుదలయ్యేది. ఈ విధానం ద్వారా పనులు తక్కువ.. నిధుల వినియోగం ఎక్కువగా ఉండి ప్రజాధనం ఎక్కువగా దుర్వినియోగం అయ్యేది.

మారిన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారంగా ప్రతి పైసాకు లెక్క చూపే విధంగా డిజిటల్‌ కీ అమలు చేయబోతున్నారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్‌ పవర్‌ అధికారం ఇచ్చారు. గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ముందుగా ఇ–పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నమోదుచేసిన తరువాత ఆన్‌లైన్‌ చేస్తే డిజిటల్‌ చెక్‌ బయటకు వస్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సెల్‌నంబర్లకు ఓటీపీ వస్తుంది. డిజిటల్‌ చెక్‌పై సర్పంచ్, ఉససర్పంచ్‌ సంతకాలు చేసి కార్యదర్శి ఎస్టీఓకు పంపిస్తారు. అప్పుడు నిధులు విడుదల అవుతాయి. ఏమాత్రం తప్పులు దొర్లినా నిధుల విడుదల చేతికి రావడం కష్టం.

ఈ–పంచాయతీ సేవలపై శిక్షణ
కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం డిజిటల్‌ సేవలు అమలు చేయబోతున్నాం. ఆన్‌లైన్‌లోనే చెక్కులను అందిస్తాం. సంతకాలను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌ చేయాలి. డిజిటల్‌ సేవలపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చాం. త్వరలో జిల్లాలో ఇ–గవర్నెన్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
– డి. వెంకటేశ్వరరావు, డీపీఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top