దమ్‌.. మారో దమ్‌ | Drug Mafia Increasing In Hyderabad City | Sakshi
Sakshi News home page

దమ్‌.. మారో దమ్‌

May 16 2019 1:27 AM | Updated on May 16 2019 4:08 AM

Drug Mafia Increasing In Hyderabad City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల గురించి విన్నాం కానీ... గంజాయి ప్రాసెసింగ్‌ యూనిట్ల గురించి ఎవరూ విని ఉండరు. కానీ, మన ముత్యాల నగరంలో ఈ యూనిట్లు ఉన్నాయంటే ఆశ్యర్చం కలుగక మానదు. నగరంలో డ్రగ్స్‌ సరఫరాలో భాగంగా ఈ గంజాయి ప్రాసెసింగ్‌ యూనిట్లు నడుస్తున్నాయి. ఇటీవల పటాన్‌చెరు సమీపంలో గంజాయిని ద్రవరూపంలోకి మార్చి విక్రయిస్తున్న రాకెట్‌ను ఎక్సైజ్‌ అధికారులు బట్టబయలు చేశారు. ఎక్కడ నుంచో తీసుకొచ్చిన గంజాయిని నగరశివారులోని ఫాంహౌస్‌ల్లో ప్రాసెస్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎండిన గంజాయి ఆకులను వేరు చేసి, పొడిచేస్తారు. దాన్ని సిగరెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నారు. కొందరు గంజాయిని ద్రవరూపంలోకి మారుస్తున్నారు. ఇక అనాథ పిల్లలు, రిక్షా పుల్లర్లు, పాన్‌షాపులు, కమీషన్‌ ఏజెంట్లు.. పెడ్లర్లుగా మారి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. నగరంలో

డబ్బు పెరుగుతున్న కొద్దీ.. జల్సాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్, మెడికల్, కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ దందా నడుస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు యువత ఆల్కహాలు, సిగరెట్లతో వచ్చే కిక్కు సరిపోవడం లేదంటూ ‘మత్తు’కోసం వెర్రివేషాలు వేస్తున్నారు. ముజ్రా, రేవ్‌ పార్టీలు నిర్వహించేవారిని సంప్రదిస్తున్నారు. ఈ నిర్వాహకులే పలు రకాల మత్తు మందులను కూడా సరఫరా చేస్తున్నారు. ఈ పార్టీలు ఏ అర్ధరాత్రో మొదలై.. తెల్లవారుజాము వరకు సాగుతాయి. పైగా రాత్రంతా హుషారుగా ఉండాలంటే.. ఇదంతా కామన్‌ అని, లేటెస్ట్‌ కల్చర్‌ అని.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. కొత్త మత్తు కోసం వెదికే అమాయక యువత వీరి వలలో పడి, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు.

పబ్బులో పరిచయాలు...  
నగరంలో డ్రగ్స్‌ను అలవాటు చేసేందుకు, పంపిణీ చేసేందుకు వేర్వేరు పార్టీలు పనిచేస్తుంటాయి. మొదటిదానికి పబ్‌లు, రిసార్టుల్లో జరిగే పార్టీలను లక్ష్యంగా ఎంచుకుంటారు. అక్కడికి వచ్చే ప్రముఖులు, నటులు, మోడళ్లతో పరిచయం చేసుకున్నాక పార్టీ కోసమంటూ కొద్దిగా తీసుకోమంటూ మభ్యపెడతారు. ఇవి తీసుకుంటే నిత్యనూతనంగా ఉండొచ్చని, స్కిన్‌ టోన్‌ (శరీర రంగు) మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచవచ్చని ఆశ కల్పిస్తారు. మొదట వాళ్లే ఉచితంగా మత్తు పదార్థాలిస్తారు. తర్వాత కావాలంటే.. ఈసారి ఫలానా వాళ్లు ఇస్తారంటూ పరిచయం చేస్తారు. ఇక అక్కడ నుంచి కొనుగోలు, ఆర్డరంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తుంది.  

ఇంజనీరింగ్‌ విద్యార్థులే లక్ష్యం...
మణికొండ, నానక్‌రాంగూడ, మేడ్చల్, కొంపల్లి, ఇబ్రహీంపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా మడత మంచాలపై పాకెట్లలో నింపి రూ.150 నుంచి రూ.500 వరకు గంజాయిని విక్రయిస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడిలో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వీటిని వినియోగిస్తుండటంతో దీనికి డిమాండ్‌ పెరిగింది. కొంతకాలంగా మహిళా ఉద్యోగులు కూడా వీటికి బానిసలవడం గమనార్హం. అందుకే, రవాణా చేసే సమయంలో వాసన రాకుండా తేనెలా ద్రవ రూపంలోకి మారుస్తున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి విక్రయాలు సాగుతున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  

పెడ్లర్లుగా వీధి బాలలు...
నగరంలో జరుగుతున్న డ్రగ్స్‌ పంపిణీలో ముఠాలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయి. సరఫరా కోసం ఎక్కువగా అనాథలు, వీధి బాలలను, యాచకులను ఎంచుకుంటున్నారు. వీరికి డబ్బులు ఎరజూపి చెప్పిన చోట సరకు డెలివరీ అయ్యేలా చేస్తున్నారు. ఒకవేళ వీరు పోలీసులకు, ఎక్సైజ్‌ అధికారులకు పట్టుబడ్డా.. అసలు ముఠా మాత్రం సేఫ్‌గా ఉంటుంది. దీంతోపాటు కళాశాలల వద్ద ఉండే పాన్‌షాపులు, బేకరీలు, సినిమా హాళ్లు, మాల్‌ల వద్ద పెడ్లర్లతో విక్రయిస్తున్నారు.  

కీటమైన్‌.. నగరం నుంచే ఇతర రాష్ట్రాలకు..
రంగు, రుచీ, వాసనలేని కీటమైన్‌ను సాధారణంగా సర్జరీలు చేసే సమయంలో మత్తు మందు కింద వాడతారు. కానీ, కొందరు దీన్ని మత్తు పదార్థంగా తయారు చేస్తున్నారు. కీటమైన్‌ను హైదరాబాద్‌లోని నాచారంలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తుండగా.. గత నెలలో నార్కోటిక్స్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. వాస్తవానికి బెంగళూరులో అమ్ముతుండగా పట్టుకుని తీగ లాగితే.. డొంక హైదరాబాద్‌లో దొరికింది. ఈ దాడుల్లో క్వింటాళ్లకొద్దీ.. ఈ డ్రగ్‌ను పట్టుకోవడం కలకలం సృష్టించింది. ఈ డ్రగ్‌ మత్తు కోసం తీసుకున్నా ప్రమాదమే కాదు.. మరిన్ని అక్రమ కార్యకలాపాలకు కారణమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలవాటు ఇలా...
డ్రగ్స్‌ తీసుకుంటే నిత్యనూతనంగా ఉండొచ్చని, స్కిన్‌ టోన్‌ (శరీర రంగు) మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచవచ్చని ఆశ కల్పిస్తారు. మొదట వాళ్లే ఉచితంగా మత్తు పదార్థాలిస్తారు. తర్వాత కావాలంటే.. ఈసారి ఫలానా వాళ్లు ఇస్తారంటూ పరిచయం చేస్తారు. ఇక తర్వాత అంతా ఆన్‌లైనే.

విద్యార్థులే లక్ష్యం...
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్, మెడికల్, కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నారు. ఆల్కహాలు, సిగరెట్లతో వచ్చే కిక్కు సరిపోవడం లేదంటూ యువత ‘మత్తు’ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

సరఫరా ఇలా...
సరఫరా కోసం ఎక్కువగా అనాథలు, వీధి బాలలను, యాచకులను ఎంచుకుంటున్నారు. వీరికి డబ్బులు ఎరజూపి చెప్పిన చోట సరకు డెలివరీ అయ్యేలా చేస్తున్నారు. పాన్‌షాపులు, బేకరీలు, సినిమా హాళ్లు, మాల్స్‌ వద్ద పెడ్లర్లతో విక్రయిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement