విద్యుత్‌ సౌధలో టెన్షన్‌.. టెన్షన్‌..!

Division Of Employees In Power Companies In Telangana - Sakshi

ట్రాన్స్‌కో, డిస్కంలకు చేరుకున్న ఏపీలో రిలీవైన ఉద్యోగులు

తీవ్రంగా ప్రతిఘటించిన తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ...తీవ్ర ఉద్రిక్తత..

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల విభజన అంశం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ సంస్థల్లో పని చేస్తున్న స్థానిక ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్‌ చేసి, తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఆయా ఉద్యోగులు సోమవారం రిలీవ్‌ ఆర్డర్లు తీసుకుని తెలంగాణ విద్యుత్‌ సంస్థల కార్యాలయాల వద్దకు చేరుకున్నారు.అప్పటికే అక్కడ భారీగా మోహరించిన తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యుత్‌ సౌధ సహా మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఎన్‌.శివాజీ, పి.అంజయ్య, రామేశ్వర్‌శెట్టి, షరీఫ్, వి నోద్, గణేష్, రవికుమార్, వీరస్వామి, పరమేశ్, తిరుపతయ్య, అనిల్‌ సహా పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ఆయా కార్యాలయాల ముందు బైఠాయించారు.

ఏపీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయా కార్యాలయాల ప్రధాన గేట్ల ముందు పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఏపీ ఉద్యోగులు లోనికి వెళ్తే..తెలంగాణ ఉద్యోగులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి, ఆ మేరకు అక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.కనీసం ఉద్యోగుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా వారినెలా రిలీవ్‌ చేస్తారని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలను ప్రశ్నించారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన అం శంలో జస్టిస్‌ ధర్మాధికారి ఏపీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగే విధంగా కేటాయింపులు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వారిని రిలీవ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top