‘ధరణి’కి  స్పందనేదీ

Dharani website design tenders were unresponsive - Sakshi

వెబ్‌సైట్‌ డిజైన్‌ టెండర్లకు నిరాశే

ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వస్తాయని ఆశించిన ప్రభుత్వం

భూముల విషయంలో అవగాహనలేక కంపెనీల వెనుకంజ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూరికార్డుల నిర్వహణ కోసం ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ వెబ్‌సైట్‌ డిజైన్‌ టెండర్లకు స్పందన కరువయింది. ఈనెల 29న టెండర్‌ దాఖలు గడువు ముగియగా, కేవలం రెండంటే రెండు బిడ్లే వచ్చినట్టు సమాచారం. అందులోనూ ఓ సంస్థ టెండర్‌ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పుడు రేసులో ఒకే సంస్థ మిగిలింది. ఈ వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీకోసం మైక్రోసాఫ్ట్, విప్రోలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావించినా అనుభవలేమి కారణంగా ఆయా సంస్థలు బిడ్‌ దాఖలు చేయలేదు. దీంతో వచ్చిన ఒక్క కంపెనీకి టెండర్‌ కట్టబెట్టాలా.. లేదా రద్దు చేసి మళ్లీ నిబంధనలు మార్చి టెండర్‌ పిలవాలా అనే విషయంలో రెవెన్యూ వర్గాలు ఏమీ తేల్చుకోలేకపోతున్నాయి. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కు వదిలేసినట్టు సమాచారం.
 
క్లిష్ట నిబంధనలే కారణమా? : ‘ధరణి’వెబ్‌సైట్‌ డిజైన్‌ టెండర్లకుగాను ప్రభుత్వం చాలా నిబంధనలు విధించింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా బహుళ ప్రయోజనార్థ భూరికార్డుల నిర్వహణ ఉండాలనే ఆలోచనతో వాటిని రూపొందించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా అంచనాతో రూపొందించే ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 4కోట్ల సర్వే నంబర్లలోని భూముల వివరాలు పొందుపరచాల్సి ఉంది. మొదటి దశలో మ్యుటేషన్‌ సర్వీసులు, రెండో దశలో సర్వీసుల ఇంటిగ్రేషన్, మూడో దశలో జీఐఎస్, నాలుగో దశలో బ్లాక్‌ చెయిన్‌ విధానాలను అమల్లోకి తేవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 600 రెవెన్యూ కార్యాలయాల్లో 600 మంది సాంకేతిక నిపుణులను కూడా ఈ సంస్థే సమకూర్చాలని నిబంధన విధించారు. పట్టణ ప్రాంతాల్లోని రికార్డులు కూడా నిర్వహించాలని, భూముల్లో వేసిన పంటల వివరాలతో పాటు కోర్‌బ్యాంకింగ్‌ సదుపాయం ఉండేలా సాఫ్ట్‌వేర్‌ తయారు చేయాలని పేర్కొన్నారు.భూరికార్డుల నిర్వహణకోసం ఉద్దేశించిన ఇలాంటి ప్రాజెక్టును చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కారణంగానే బిడ్‌ దాఖలు చేయడంలో కొన్ని సంస్థలు వెనుకడుగు వేసినట్టు సమాచారం. 

ఇప్పుడేం చేయాలి..? : ప్రాజెక్టుకు టెండర్ల దశలోనే నిరాశ ఎదురవడంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బెంగళూరుతో పాటు ఇతర దేశాల్లో భూములకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించిన సంస్థ ఒకటి టెండర్లలో పాల్గొన్న నేపథ్యంలో ఆ సంస్థ టెక్నికల్‌ ప్రజెంటేషన్‌లను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చిన ఒక్క సంస్థకే టెండర్‌ ఇవ్వాలా... లేదా మరోసారి టెండర్లు పిలవాలా అన్న సందిగ్ధంలో ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top