‘ఫీజు’లపై ఆంక్షలు!

Delay In Releasing Students Scholarships In Telangana - Sakshi

రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో అవరోధాలు

సంక్షేమ శాఖల బిల్లులను ఆమోదించని ఖజానా శాఖ

2017–18 ఏడాది బకాయిలే రూ.1,240 కోట్లు

ఈ ఏడాదికి ఇంకా ప్రారంభం కాని మంజూరీ ప్రక్రియ

ఇంకా పరిశీలన దశలోనే 2018–19 దరఖాస్తులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు ఫీజు గండం వచ్చిపడింది. ప్రభు త్వం నిధులు విడుదల ఉత్తర్వులిస్తున్నా, సంక్షేమశాఖలు కేటగిరీలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఆమోదించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. వేతనాలు, డైట్‌ చార్జీలు మినహా మిగతా బిల్లులను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో 2017–18 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్థులు కాలేజీలను వీడినప్పటికీ ఫీజు చెల్లించని కారణంగా వారి ధ్రువ పత్రాలను యాజమాన్యాలు ఇవ్వడంలేదు. 2017– 18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.04 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2018 ఫిబ్రవరి రెండో వారం వరకు కొనసాగింది. వాటి పరిశీలన గతేడాది జూన్‌లో ప్రారంభమై డిసెంబర్‌ వరకూ కొనసాగింది. ఈ క్రమంలో పూర్తయిన దరఖాస్తుల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఖజానాశాఖకు సమర్పిస్తూ వచ్చారు.

కానీ ఖజానాశాఖలో ఆ బిల్లుల ఆమోదం ప్రహసనంగా మారింది. పలు రకాల ఆంక్షలను పేర్కొంటూ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన బిల్లులను అటకెక్కిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉద్యోగుల వేతనాలు, డైట్‌ చార్జీల బిల్లులు మినహా మిగతా చెల్లింపులు జరగలేదు. జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మరోమారు చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉద్యోగుల వేతన బిల్లులనే ఆమోదిస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఫీజుల చెల్లింపు నిలిచిపోయింది.

2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు- రూ.13,04,431
ఉపకార వేతనాలు, ఫీజులకు అవసరమైన నిధులు- రూ.2,315  కోట్లు
ఇప్పటివరకు విద్యార్థులకు విడుదల చేసినవి- రూ.1,075  కోట్లు 

 
బకాయిలు రూ. 1,240 కోట్లు 
ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖాధికారులు ఖజనాశాఖకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు మెజారిటీ విద్యార్థులకు ఫీజులు మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు, ఉపకార వేతనాల కింద రూ. 2,315 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 1,075 కోట్లకు సంబంధించిన బిల్లలనే ఖజానాశాఖ ఆమోదించడంతో ఆ మేరకు విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. ఇంకా రూ. 1,240 కోట్ల మేర విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లులు ఖజానాశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఖజానాశాఖపై ఆంక్షలు తొలగితే తప్ప వాటి విడుదల సులభతరం కాదని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
2017–18 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు... 
కేటగిరీ    ఫ్రెషర్స్‌         రెన్యువల్స్‌      మొత్తం 
ఎస్సీ     98,180        1,31,706     2,29,886 
ఎస్టీ      55,829         76,215       1,32,044 
బీసీ     3,05,215      4,17,462     7,22,677 
డిజేబుల్‌    84                117           201 
ఈబీసీ    26,933        58,913       85,846 
మైనారిటీ  65,700     68,077        1,33,777 

ఈ ఏడాది విద్యార్థులకు చెల్లింపులు కష్టమే...! 
ప్రస్తుతం 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గతేడాది అక్టొబర్‌ నాటికే దరఖాస్తుల గడువు ముగియగా అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో తొలుత డిసెంబర్‌ 31 వరకు, ఆ తర్వాత జనవరి నెలాఖరు వరకు గడువు పొడిగించిన అధికారులు... విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఈ నెలాఖరు వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఫ్రెషర్స్‌ 5.81 లక్షలు, రెన్యువల్‌ విద్యార్థులు 7.18 లక్షల మంది ఉన్నారు. సంక్షేమశాఖలు ఒక పక్క దరఖాస్తులు స్వీకరిస్తూనే మరోపక్క వాటి పరిశీలన ప్రారంభించాయి. ఇప్పటివరకు లక్ష మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 70 వేల వరకు మంజూరు చేశారు. అయితే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో 2018–19 చెల్లింపులను ఇప్పట్లో చేసే అవకాశం కనిపించడం లేదు. 

2018–19 విద్యా సంవత్సరం దరఖాస్తులు (ఇప్పటివరకు)... 
కేటగిరీ    దరఖాస్తులు 
ఎస్సీ     2,32,442 
ఎస్టీ     1,30,749 
బీసీ     7,17,246 
డిజేబుల్‌    227 
ఈబీసీ    83,464 
మైనారిటీ    1,36,498 

నిధులు విడుదల చేయాలి... 
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను నెలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నెలనెలా నిధులిస్తే చెల్లింపులు సులభతరమయ్యేవి. కానీ మొదట్లో ఇచ్చినా ఆ తర్వాత చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. ఖజానశాఖపై ఆంక్షలు పెట్టడంతో బిల్లులను ఆమోదించట్లేదు. ఫలితంగా సిబ్బంది వేతనాల చెల్లింపు, కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా నెలవారీ నిబంధన ప్రకారం నిధులు విడుదల చేయాలి.  – గౌరి సతీశ్, తెలంగాణ కళాశాలల యాజమాన్యాల జేఏసీ కన్వీనర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top