రాష్ట్రంలో దొంగల పాలన

CPI Telangana Secretary Chada Venkat Reddy Fires on TRS Govt - Sakshi

కామేపల్లి: రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతుందని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధికి చేపట్టిన పోరుబాట కామేపల్లికి చేరుకుంది. సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకటరెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మాయ మాటలతో, మాటల గారడీతో పాలన కొనసాగిస్తున్పానరని, హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు జెండాలను పక్కన పెట్టి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ మాత్రం రాష్ట్రంలో నైజాం పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని, దళితుడిని సీఎం చేస్తామని మాట తప్పారని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, రాష్ట్రంలో 3.50 లక్షల మంది దళితులు అర్హులున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు బాగోలేవని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. భూ సర్వే పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, లేని సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో ఇప్పటికే 3500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను పట్టించుకోలేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పొందుతున్నారని ఆరోపించారు.

 కేసీఆర్‌ ఏక పక్ష నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయంలో పోలీసుల ఆగడాలు అధికమయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ మెడలు వంచైనా ఎన్నికల హామీలను నెరవేర్చాలనే పోరుబాట చేపట్టామని, ప్రజలు ఏకమై ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు ఎన్‌.బాలమల్లేష్, పశ్య పద్మ, ఎండీ యూసుఫ్, షబ్బీర్‌పాషా, బరిగెల సాయిలు, సృజన, ఆర్‌.పాండురంగాచారి, రాములుయాదవ్, ఆర్‌.జఅంజయ్యనాయక్, కె.లక్ష్మీనారాయణ, పల్లె నరసింహా, నల్లా శ్రావణి, ఏపూరి లతాదేవి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top