‘డిజిటల్‌’ లాక్‌డౌన్‌!

Coronavirus: Hugely reduced cashless transactions - Sakshi

భారీగా తగ్గిన నగదురహిత లావాదేవీలు

జనవరితో పోలిస్తే మార్చి లావాదేవీల్లో 43 లక్షల క్షీణత

లాక్‌డౌన్‌ పొడిగింపుతో లావాదేవీలు మరింత తగ్గే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ డిజిటల్‌ చెల్లింపులపైనా ప్రభావం చూపుతోంది. ఆన్‌లైన్‌ వాణిజ్యం దాదాపుగా స్తంభించడంతో డిజిటల్‌ లావాదేవీలు సైతం ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే మార్చిలో డిజిటల్‌ లావాదేవీలు 43 లక్షల మేర తగ్గిపోయినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 3.50 కోట్ల లావాదేవీలు జరగ్గా మార్చిలో అవి 3.16 కోట్లకు పడిపోయాయి. తాజాగా మే 3 దాకా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఈ నెలంతా డిజిటల్‌ లావాదేవీలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌తో తారుమారు..
పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ విస్తృతంగా పేమెంట్‌ యాప్‌లకు అనుమతులు ఇచ్చింది. తద్వారా బ్యాంకుల భౌతిక లావాదేవీలు చాలా వరకు ఆన్‌లైన్‌కు మళ్లాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రెడిట్, డెబిట్‌ కార్డులతో జరిపే లావాదేవీలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూడగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత దేశంలో అక్కడక్కడా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటిని మూసేసింది. ఈ క్రమంలో కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడం నగదురహిత లావాదేవీలు తగ్గుముఖం పట్టేందుకు దారితీసింది.

స్తంభించిన ఈ–కామర్స్‌..
లాక్‌డౌన్‌తో డిజిటల్‌ లావాదేవీల్లో కీలకంగా చెప్పుకొనే ఈ–కామర్స్‌ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. క్యాబ్, ఫుడ్‌ యాప్‌లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు హోం డెలివరీ సేవలను నిలిపేయడంతో డిజిటిల్‌ కార్యకలాపాలకు అవకాశం లేకుండా పోయింది. జనజీవనం స్తంభించడం, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు అధిక శాతం మూతపడటంతో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులు కూడా లేకుండా పోయాయి. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో ఆస్తి పన్ను, ఐటీ, జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. ఇందులో అధికంగా ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారానే వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు దాదాపుగా నిలిచి పోవడంతో ఇలాంటి చెల్లింపులన్నీ వాయిదాపడ్డాయి. దీని ప్రభావం కూడా డిజిటల్‌ చెల్లింపులపై పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top