వారందరికీ సామూహిక పరీక్షలు

Coronavirus Health MInistry Directives To Pool Testing For Migrants - Sakshi

25 మంది వలసదారుల శాంపిళ్ల చొప్పున ఒకే నిర్ధారణ పరీక్ష

ఒకవేళ పాజిటివ్‌ వస్తే ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా పరీక్ష

దేశ విదేశాల నుంచి వచ్చే వారందరికీ ఇదే తరహాలో..

ఖర్చు, సమయం ఆదాకు ఇదే మంచి విధానం

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు (పూల్డ్‌ శాంపిలింగ్‌) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్రా లను ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్‌ అనుమానిత లక్ష ణాలతో ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్య వేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. 

వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. వాస్తవంగా విదే శాల నుంచి వచ్చే వారు, సంబం ధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధా రణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్‌ వచ్చి న వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్‌ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది. 

25 మందికి ఒకేసారి..
రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరెస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ–పీసీఆర్‌)గా పిలిచే ఈ సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షల వల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానంలో 25 మంది శాంపి ళ్లను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఇం దులో పాజిటివ్‌ వస్తే, వారిలో ఎంత మందికి వైరస్‌ సోకిందో గుర్తించేం దుకు మరోసారి ఆ 25 మందికి విడివిడిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేస్తారు. ఒకవేళ నెగెటివ్‌ వస్తే వారందరికీ కరోనా లేనట్టు గుర్తించి ఇంటికి పంపిస్తారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో సామూహిక కరోనా పరీక్షలను సీసీఎంబీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల వంద మందిలో కరోనా ఉందో లేదో అంచనా వేయాలంటే, నాలుగు పరీక్షలు చేస్తే సరిపోతుంది. దీంతో టెస్టింగ్‌ కిట్లు సరిపోతాయని, సమయం, డబ్బు ఆదా అవుతాయని అంటున్నారు. ఒక్కో పరీక్షకు సగటున రూ.4,500 ఖర్చవుతుందని అంచనా. 

ప్రతి ఒక్కరినీ విడివిడిగా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామూహిక పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడనుంది. అదీగాక సర్కారు క్వారంటైన్లలో ఉండే వలసదారులకు, విదేశాల నుంచి వచ్చే వారికి, గ్రీన్‌జోన్లలో ఉన్నవారికి సామూహిక పరీక్షలు చేయడమే మేలని అంటున్నారు. 

సిబ్బంది కోసం ఇదీ ప్రొటోకాల్‌
సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రొటోకాల్‌ రూపొందించింది. దీని ప్రకారం.. శిక్షణ పొందిన లేబరేటరీ సిబ్బంది ఆప్రాన్, హ్యాండ్‌గ్లోవ్స్, గాగుల్స్, ఎన్‌–95 మాస్క్‌లు ధరించాలి. ప్రొటోకాల్‌ ప్రకారం ఆయా వ్యక్తుల గొంతు నుంచి స్వాబ్‌ శాంపిళ్లను సేకరించాలి. శాంపిళ్లు ఎవరివనే వివరాలను లేబులింగ్‌పై రాయాలి. ఇలా ఒక ధపాలో సేకరించిన 25 శాంపిళ్లను ట్రిపుల్‌ లేయర్‌లో ప్యాకేజ్‌ చేస్తారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కోల్డ్‌–చైన్‌లో లేబరేటరీలకు తరలించి వాటిని ఒకేసారి పరీక్షిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top