ఇక గాంధీలోనే కరోనా నిర్ధారణ

Coronavirus Disease Tests At Gandhi Hospital - Sakshi

నగరానికి చేరుకున్న వ్యాధి నిర్ధారణ కిట్లు 

గాంధీ ఆస్పత్రిలో ట్రయల్‌రన్‌ ప్రారంభం

మరోవైపు పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు  

గాంధీ ఆస్పత్రి/నల్లకుంట: కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ ట్రయల్‌ రన్‌ పరీక్షలు గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) ల్యాబ్‌ నుంచి వ్యాధి నిర్ధారణకు అవసరమైన రీఏజెంట్స్‌ (ద్రావకాలు)ను హైదరాబాద్‌కు తెప్పించింది. గాంధీ ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నాగమణి నేతృత్వంలోని వైద్య బృందం పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వీప్‌మెంట్‌ ధరించి ట్రయల్‌ రన్‌లో భాగంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించింది. గాంధీలో వచ్చిన రిపోర్టులను, పుణే వైరాలజీ ల్యాబ్‌ జారీ చేసిన రిపోర్టులతో సరి చూసి, రిపోర్టుల జారీలో ఎలాంటి తేడాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పూర్తిస్థాయిలో నిర్ధారణ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు.

మరో 8 అనుమానిత కేసులు.. 
కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతూ తాజాగా గాంధీ ఆస్పత్రిలో నలుగురు, ఫీవర్‌ ఆస్పత్రిలో మరో నలుగురు బాధితులు చేరారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇటీవలే వీరంతా చైనా నుంచి నగరానికి చేరుకున్నారు. వీరిలో 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు 16 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, నిర్ధారణ పరీక్షలు చేయించగా, వీరిలో 9 మందికి నెగిటివ్‌ వచి్చంది. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

 కరోనా కాదు.. స్వైన్‌ఫ్లూ.. 
కరోనా అనుమానంతో 4 రోజుల క్రితం ఫీవర్‌లో చేరి, గురువారం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన గోదావరిఖనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన భర్త(31), భార్య(25), కుమార్తె(5)ల్లో భర్త సహా కుమార్తెకు స్వైన్‌ ఫూగా నిర్ధారణ అయింది. భార్య రిపోర్టు నెగిటీవ్‌ వచి్చంది. దీంతో వైద్యులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సిందిగా సూచించారు.

అమాంతం పెరిగిన మాస్‌్కల ధరలు 
కరోనా, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతకమైన వైరల్‌ ఫీవర్లకు నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది, రోగులు, రోగి సహాయకులు భయాందోళనకు గురై తప్పనిసరిగా సాధారణ మాస్‌్కలతోపాటు ఎన్‌90 మాస్క్‌లను వినియోగిస్తున్నారు. దీంతో మాస్క్‌ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

కరోనాపై పుకార్లు నమ్మవద్దు: ఈటల 
సుల్తాన్‌బజార్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా నుంచి భారత్‌కు వచి్చన 12 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించామని తెలిపారు. అందులో 9 మందికి వైరస్‌ లేదని నిర్ధారణ అయిందన్నారు. మిగత వారిని వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు పట్టించుకోవద్దని తెలిపారు. 

వెళ్లిపోయిన కరోనా అనుమానితులు
చైనా నుంచి ఇటీవలే నగరానికి చేరుకుని జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న (25), (28), (30), (31) వయసున్న బాధితులను ఫీవర్‌ ఆస్పత్రి వైద్యులు ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. వీరిలో ముగ్గురు నగరానికి చెందిన వారు కాగా, మరొకరు తాండూరుకు చెందిన యువతిగా తెలిసింది. గురువారం చేరిన ఓ వ్యక్తితోపాటు, శుక్రవారం చేరిన నలుగురిలో ఇద్దరు ఇక్కడి వార్డులో ఉండలేమని చెప్పి సాయంత్రం డిశ్చార్జ్‌ చేసుకుని, ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. రేబిస్‌వార్డు పక్కనే ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయడం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే రోగుల విముఖతకు కారణమని తెలిసింది. కాగా ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో రెండు అనుమానిత కరోనా కేసులు ఉన్నాయని, వీరి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనాపై అప్రమత్తంగా ఉన్నామని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ.శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. కరోనా నోడల్‌ ఆఫీసర్‌గా ఆర్‌ఎంవో ప్రభాకర్‌రావును నియమించినట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top