అడ్డంగా దొరికిన ఖాకీలు | Constables in drunken | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిన ఖాకీలు

Apr 25 2014 12:17 AM | Updated on Mar 19 2019 6:01 PM

చెక్‌పోస్టులో తనిఖీలు చేయాల్సిన కానిస్టేబుళ్లు మద్యం మత్తులో మునిగిపోయారు. మమ్మల్నెవరు ‘తనిఖీ’ చేస్తారనుకున్నారో ఏమో మరి.. చెక్‌పోస్టును గాలికొదిలేసి వెళ్లిపోయారు.

పరిగి, న్యూస్‌లైన్: చెక్‌పోస్టులో తనిఖీలు చేయాల్సిన కానిస్టేబుళ్లు మద్యం మత్తులో మునిగిపోయారు. మమ్మల్నెవరు ‘తనిఖీ’ చేస్తారనుకున్నారో ఏమో మరి.. చెక్‌పోస్టును గాలికొదిలేసి వెళ్లిపోయారు. డీఎస్పీ ‘తనిఖీ’తో కానిస్టేబుళ్ల బాగోతం బయటపడింది. ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన డీఎస్పీ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చన్గొముల్ ఠాణాకు చెందిన కానిస్టేబుళ్లు దయానంద్ (పీసీ నంబర్ 2256), వెంకటేష్(2902), తుక్యానాయక్(2748), చంద్రశేఖర్‌లు బుధవారం రాత్రి మన్నెగూడ చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది రాత్రి 10-12 గంటల వరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సి ఉంది.

 సిబ్బంది డ్యూటీ ఎలా చేస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు రాత్రి 11 గంటల సమయంలో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ మన్నెగూడకు వచ్చారు. ఆ సమయంలో చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ఎవరూ లేరు. దీంతో డీఎస్పీ వెంటనే సంబంధిత ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మందలించారు. విధుల్లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లను అక్కడికి రప్పించారు. వారు మద్యం మత్తులో ఉన్నారని అనుమానించిన ఆయన వారిని పరిగి ఠాణాకు తీసుకొచ్చారు. పరిగి ఎస్‌ఐ లింగయ్యను ఇచ్చి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. డ్యూటీలో ఉన్న వైద్యుడు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

కానిస్టేబుళ్లు దయానంద్, వెంకటేష్, తుక్యానాయక్‌లు మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించి ‘డ్రంకెన్ కండిషన్’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో కానిస్టేబుళ్ల వివరాలు రాయించకుండానే పోలీసులు వారిని తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం కంగుతిన్న డాక్టర్ తనకు తెలిసిన వారితో వివరాలు సేకరించి రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఈ విషయమై చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. కానిస్టేబుళ్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement