బొగ్గుగని కార్మికుల టోకెన్‌ సమ్మె విజయవంతం

Coal Workers Strike Against FDI Is Successful - Sakshi

సాక్షి, భూపాలపల్లి: బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని బొగ్గుగని కార్మికులు మంగళవారం చేపట్టిన టోకెన్‌ సమ్మె విజయవంతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గుగని కార్మికులు స్వచ్ఛందంగా టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో భూపాలపల్లి ఏరియాలోని  6700 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి, సంస్థకు  2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో టీజీజీకేఎస్‌, ఏఐటీసీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీసీ, సీఐటీయూసీ, హెచ్‌ఎమ్‌ఎస్‌, బీఎమ్‌ఎస్‌ వంటి పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 600 మంది బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులపై తమ నిరసనను తెలిపారు.

అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టోకెన్ సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎమ్‌ఎస్‌, హెచ్‌ఎమ్‌ఎస్‌, సీఐటీయూతో పాటు కోల్ ఇండియా సంఘాలు.. సింగరేణిలో ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీజీజీకేఎస్‌ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. మణుగూరు ఏరియాలో అత్యవసర విధులకు సంబంధించిన కార్మికులు తప్ప, మిగతా 90 శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top