ఆకుపచ్చ తెలంగాణ | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ తెలంగాణ

Published Thu, Aug 22 2019 2:45 AM

CM KCR Visit Siddipet District With Ministers And District Collectors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సిద్ధిపేట/గజ్వేల్‌ : అడవులు విరివిగా ఎక్కడ పెరిగితే ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారు.. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, హరిత జిల్లాల ఏర్పాటుకు కలిసి కట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. కలెక్టర్లు, మంత్రులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను బుధవారం మం త్రులు, కలెక్టర్లకు ఆయన చూపించారు. సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను, గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలోని గజ్వేల్‌ షరీఫ్‌లో 160 హెక్టార్లలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడి నుంచి 2016లో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ నాటిన మొక్కలను కలెక్టర్లు, మంత్రులకు చూపించారు.  

మంకీస్‌ ఫుడ్‌ కోర్టులు... 
కొత్త రెవెన్యూ, పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన గురించి కలెక్టర్లతో కేసీఆర్‌ చర్చించారు. ‘పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి. ఇందుకోసం 60 రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్నాం. ఈ చట్టంతో రైతులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు. అడవులు నశించడంతో పండ్లూఫలాలు లేక కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. కోతులు వాపస్‌ పోవాలంటే వాటికి అక్కడే ఆహారం లభించేలా చెట్లను పెంచాలి. ఫల, మేడి, మర్రీ లాంటి 27 రకాల పండ్ల మొక్కలు నాటితే కోతులకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అడవులు అంటే కోతులు, ఇతర జంతువులతో కళకళలాడుతూ ఉండాలి’అని చెప్పారు. 

గచ్చకాయ చెట్టు పరిచయం చేసింది నేనే..  
‘అడవులు, చెలకలకు గచ్చకాయ చెట్టు కంచెగా ఉంటుంది. జంతువులు, మనుషులు కూడా లోపలికి వెళ్లలేరు. అటవీ అధికారులకు దాన్ని పరిచయం చేసింది నేనే’అని చెప్పిన కేసీఆర్‌ ఇలా నాటిన గచ్చకాయ చెట్లను కలెక్టర్లకు చూపించారు. ఎడారిగా ఉన్న సిద్దిపేట అటవీ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పంచిన కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, అటవీశాఖ అధికారుల పనితీరు భేష్‌ అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గజ్వేల్‌ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్‌ స్టాక్‌ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీంతో బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ యాదవరెడ్డి, వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జహంగీర్, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ రాజయ్య సైతం పాల్గొన్నారు.  

పచ్చటి గజ్వేల్‌... 
‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లు లేకుండా ఏడారిగా ఉండేవి. అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఆ ఫలితమే ఇప్పటి ఈ పచ్చటి గజ్వేల్‌. ఇక్కడ 27 రకాల పండ్ల మొక్కలను పెంచడంతో కోతులకు ఆహారం అందుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉంది. ఇది మన భూభాగంలో 23.4 శాతం. అడవుల పెంపకంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములు కావాలి. అడవుల్లో చెట్ల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి’అని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా కోమటిబండలో ప్రారంభించిన మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను కలెక్టర్లకు చూపించారు. అక్కడే వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement