సాగు మారాలి

CM KCR Review Meeting On Agriculture At Pragati Bhavan On Wednesday - Sakshi

వ్యవసాయం లాభసాటి కావాలి

రైతులు దేశ, విదేశాల్లో విజ్ఞాన యాత్రలు చేయాలి

వ్యవసాయ శాఖ పునర్వ్యవస్థీకరణ

గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నం..

పెరిగిన సాగు విస్తీర్ణం అవసరాలకు అదనంగా ఏఈఓల నియామకం 

ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలి

వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం 

విపత్తుల వల్ల ఏర్పడే ఆకలి సమస్య చాలా దారుణమైనది. యుద్ధం కన్నా ఆకలి ఎక్కువ విలయం సృష్టిస్తుంది. కాబట్టి దేశం ఎప్పుడూ ఆహారధాన్యాల ఉత్పత్తిలో కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలి. 135 కోట్ల మంది ప్రజలున్న దేశానికి మరే దేశం తిండి పెట్ట జాలదు. కాబట్టి మన ప్రజలకు మనమే తిండి పెట్టే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం చేయాలి.  – కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో సాగు విధానాలు మారాలని, సాంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక సాగు విధానాలు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పిలుపునిచ్చారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ధనవంతులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని కేసీఆర్‌ అన్నారు. ‘ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఏఈఓలను నియమించుకోవాలి. వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

గొప్ప పరివర్తన రావాలి...
‘తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలి. అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఎంతో వ్యయం చేస్తున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలి. గొప్ప పరివర్తన రావాలి. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలి. యాంత్రీకరణ పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా సింగిల్‌ పిక్‌ క్రాప్స్‌ వచ్చాయి. వాటిని అధ్యయనం చేయాలి. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలి. వాటి సాగు పద్ధతులు తెలుసుకోవాలి. అధికారులు, రైతులు తరచూ విజ్ఞానయాత్రలు చేయాలి. రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసి రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్‌ ఉందో తెలుసుకోవాలి. మార్కెట్‌ను అధ్యయనం చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలురకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేయాలి. ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను పెట్టి, ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్‌ డైరెక్టర్‌ ను నియమించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

పంటల లెక్కలు తీయండి...    
‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారు. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదు అంటే, ఎవ్వరూ మక్కలు వేయలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారు. కాబట్టి రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలి. అది చాలా ముఖ్యం’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగని విధంగా...
‘వ్యవసాయరంగ అభివృద్ధికి స్వతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు ఉచితంగా సాగునీరు, నీటి తీరువా విధానం రద్దు, పాత బకాయిల మాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు రూపంలో పెట్టుబడి, రూ.5 లక్షల రైతుబీమాను ప్రభుత్వం అందిస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ప్రతీ పంటను నూటికి నూరుశాతం కొనుగోలు చేసింది. రైతులను సంఘటిత పరిచేందుకు రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి అవుతుంది. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయి. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది’అని కేసీఆర్‌ వివరించారు. వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సిఎస్‌ సోమేశ్‌ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్‌ రెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్, డిప్యూటీ డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top