లాభాల్లో కార్మికులకు 27% వాటా

CM KCR Boon To Singareni Workers 27 Percent Share Profit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/మంచిర్యాల : బక్రీద్‌ పర్వదినాన సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు కురిపించారు. సంస్థ లాభాల్లో 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కంపెనీ 2017–18 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.1,212 కోట్ల లాభాల నుంచి ఈ మొత్తం వాటాను కార్మికులకు పంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణిలో కార్మికులను ఇక నుంచి వర్కర్లు అని పిలవవద్దని, వారినీ ఉద్యోగులుగానే సంబోధించాలని సీఎం చెప్పారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనేది విడనాడాలని, అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందాలని సూచించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్, టీబీజీకేఎస్‌ నాయకులు ప్రగతిభవన్‌లో బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు.

గతంలో సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించి, వెంటనే నిర్ణయాలు ప్రకటించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది లాభాల్లో 25 శాతం వాటా ఇచ్చామని, ఈసారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి íసీఎండీ శ్రీధర్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్పీ) బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పారు. సింగరేణి అధికారులు హైదరాబాద్‌లో ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అందరు అధికారులు, ఉద్యోగులకు ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాన్ని అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ‘‘సింగరేణికి 120 సంవత్సరాల అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసే నేర్పు ఉంది.

భూగర్భంలోని బొగ్గును వెలికితీసిన అనుభవం, పరిజ్ఞానంతో సింగరేణి సంస్థ మరింత ముందుకుపోవాలి. సింగరేణి సంస్థ ఇప్పటికే థర్మల్, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించింది. ఇతర మైనింగ్‌ రంగాలకు విస్తరించాలి. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఇసుక నిల్వలు, గ్రానైట్‌ నిల్వలను వెలికితీయడానికి సింగరేణి ముందుకు రావాలి. బయ్యారం గనుల్లోనూ తవ్వకాలు జరిపే బాధ్యతను సింగరేణికి అప్పగించే ఆలోచనలో ప్రభు త్వం ఉంది. ఏయే మైనింగ్‌ కార్యకలాపాల్లో సింగరేణి సంస్థ పనిచేయగలదనే విషయంపై అధ్యయనం చేసి సమగ్ర పత్రం రూపొందించాలి. అనుభవం, పనితీ రు ఉపయోగించుకుని సింగరేణి సంస్థ మరింత విస్తరించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌ గాడిపల్లి కవిత, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డి, కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సింగరేణి బ్రాంచి అధ్యక్షుడు గాడిపల్లి కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎన్‌.వి.రాజశేఖర్‌రావు, నాయకులు టి. శ్రీనివాసరావు, పతంగి మోహన్‌రావు, సముద్రాల శ్రీనివాస్, జనా జయరావు, ఎ.వి.రెడ్డి, మంచాల శ్రీనివాస్, గీట్ల తిరుపతి రెడ్డి, జె.రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

విరాళాలు అందజేత... 
సింగరేణి అధికారులు ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కు రూపంలో అందించారు. అలాగే కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు ఒక నెల వేతనాన్ని కేరళ వరద బాధితుల కోసం ఇచ్చారు. ఈ మేరకు రూ.6.80 లక్షల చెక్కును కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందించారు.

కార్మికునికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు
2016–17 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.395 కోట్ల లాభాలను మాత్రమే సాధించింది. ఈ లాభాల్లో 25 శాతం.. అంటే రూ.98.80 కోట్లు కార్మికులకు పంపిణీ చేశారు. కానీ ఈసారి సింగరేణి లాభాలు రూ.1212 కోట్లు కాగా ఇందులో 27 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన రూ.327.24 కోట్లు కార్మికులకు అందనున్నాయి. ఈ మొత్తం కార్మికుల ఖాతాల్లోకి ఎప్పుడు చేరేది యాజమాన్యం త్వరలోనే ప్రకటిస్తుంది. సింగరేణి లాభం గత ఏడాదితో పోలిస్తే 207 శాతం అధికంగా వచ్చింది.

గత సంవత్సరం కార్మికుడు తీసుకున్న లాభాల వాటాతో పోల్చితే ఈసారి 3.3 రెట్లు ఎక్కువగా రానుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో కార్మికునికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించే అవకాశముంది. కార్మికుల హాజరు శాతం, ఇన్సెంటివ్‌లను పరిగణనలోకి తీసుకొని డిపార్టుమెంట్ల వారీగా ప్రత్యేక గణన చేసి పంపిణీ చేస్తారు. 10 శాతంతో మొదలైన లాభాల వాటా క్రమేపీ 27 శాతానికి చేరడం సింగరేణిలో శుభపరిణామంగా కార్మికులు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సింగరేణి కార్మికులను సంతృప్తిపరిచే ఎత్తుగడలో భాగంగానే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top