మున్సిపల్‌ ఎన్నికలపై స్పష్టత ఇవ్వండి

Clarify the municipal election Says High court - Sakshi

తెలంగాణ సర్కార్‌ను కోరిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీలు మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రభుత్వం వైఖరి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే నెల రెండో తేదీతో వాటి పాలక వర్గాల గడువు ముగుస్తుందని రాజ్యాంగంలోని 243(3) అధికరణ ప్రకారం ఐదేళ్ల పాలకవర్గం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు విచారించింది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంటూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాస్‌ గౌడ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. నవీన్‌ రావు ఆదేశించారు.

జూలై 2వ తేదీ నాటికి 53 మున్సిపాల్టీలు, మూడు నగర పాలక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తి అవుతుందని, ఈలోగా ఎన్నికలు నిర్వహించాలన్న చట్టాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వ వైఖరి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మేష్‌ జైశ్వాల్‌ వాదించారు. జనాభా నిష్పత్తి ప్రకారం మున్సిపల్‌ వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. మున్సిపల్‌ చట్టంలో సంస్కరణల పేరుతో సవరణల్ని తీసుకువస్తామనే నెపంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. వెంటనే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇదే తరహా వ్యాజ్యాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిందని, అది కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణలో ఉందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది విద్యాసాగర్‌ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రెండు రిట్‌ పిటిషన్లను కలిపి విచారణకు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 14, మే 4 తేదీల్లో లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో ఎస్‌ఈసీ కూడా గతంలో హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గత నెల 31న విచారించిన హైకోర్టు ధర్మాసనం.. మున్సిపల్‌ శాఖ వైఖరి తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top