భూమి అమ్మేసుకున్నా రైతు బీమా

Circular For Rythu Bheema Scheme In Telangana - Sakshi

ఆ ఏడాది వరకు వర్తించేలా సర్కారు నిర్ణయం

14 ఆగస్టు 1959 నుంచి 15 ఆగస్టు 2000 మధ్య పుట్టినవారు ఈ ఏడాది బీమాకు అర్హులు

‘రైతు బీమా’ మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌ : పట్టాదారు పాసు పుస్తకమున్న రైతు ‘రైతు బంధు బీమా’లో నమోదయ్యాక తన భూమిని అమ్మేసుకున్నా కూడా.. ఆ ఏడాది మొత్తం బీమా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఆగస్టు 15వ తేదీ తరువాత కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు పొందే రైతుల పేర్లతో నెలవారీగా జాబితా తయారు చేస్తామని.. ఏడాది మొత్తానికి ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి తీసుకువస్తామని పేర్కొంది. అయితే తమ పేరిట వ్యవసాయ భూమి ఉండి, 18 ఏళ్ల వయసు నిండే పట్టాదారులకు మాత్రం తర్వాతి ఏడాది రెన్యువల్‌ తేదీలోనే పాలసీ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఇక బీమా పరిధిలో ఉన్న రైతులెవరైనా మరణిస్తే.. ఆరునెలల్లోపు క్లెయిమ్‌ చేసుకోవాలి. ఆ తరువాత పరిహారం కావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రైతు బీమా అమలు మార్గదర్శకాలతో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలోనే ఎల్‌ఐసీకి ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారని.. విశ్వాసం, విస్తృతమైన సంస్థ కావడంతోనే రైతుబంధు బీమాకు ఎంపిక చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 6.5 లక్షల మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకొచ్చినట్టు, ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్టు తెలిపారు.

నామినీ పేరు మార్చుకునే అవకాశం
ఆగస్టు 15వ తేదీ నుంచి ‘రైతు బంధు బీమా’పథకం అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి, పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. బీమా చేసుకున్న రైతు ఏదైనా కారణంతో మరణిస్తే రూ.5 లక్షలు అందిస్తారు. ఒకసారి నామినీ పేరు ఇచ్చిన తరువాత కూడా నామినీలను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే టీవీ చానళ్లు, వార్తా పత్రికల ద్వారా ప్రచారం కల్పించి గ్రామాల్లో నివాసం ఉండని రైతులకు సమాచారమిచ్చి.. రైతు బీమాలోకి తీసుకురానున్నారు. ఇందుకు రైతు సమితి సభ్యులు, ఆయా గ్రామ సర్పంచ్‌ల సహకారం తీసుకుంటారు. అవసరమైతే గ్రామాల్లో ఉండని రైతులకు సమాచారం ఇవ్వాలని.. వారి ఇరుగుపొరుగు వారికి తెలియజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎల్‌ఐసీ సంస్థ ఏటా బీమా ధ్రువపత్రాలను రైతులకు అందజేస్తుంది.

మార్గదర్శకాల్లోని అంశాలివీ..
ఏటా ఆగస్టు 1న అర్హత కలిగిన ఒక్కో రైతు పేరు మీద ప్రభుత్వం జీఎస్టీతో కలిపి రూ.2,271.50 ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది.
పథకం అమలుకు వ్యవసాయశాఖ కమిషనర్‌ను నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
రైతుల వివరాలను, నామినేషన్‌ పత్రాలను జూన్‌ నెలలో సేకరించి, ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేస్తారు.
ప్రస్తుతమున్న ప్రీమియంను పాలసీ నిబంధనలకు అనుగుణంగా రెండేళ్లకోసారి సమీక్షిస్తారు.
ఆధార్‌ కార్డు ఆధారంగానే బీమా నమోదు ప్రక్రియ ఉన్నందున.. డూప్లికేషన్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. బీమా పరిధిలోకి వచ్చిన రైతుల వివరాలను ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. రెండు పాసు పుస్తకాలున్నా ఒకే బీమా పాలసీని అమలుచేస్తారు.
రెవెన్యూ శాఖ రికార్డుల ఆధారంగా 18–59 ఏళ్ల వయసున్న పట్టాదారు రైతుల నుంచి బీమా, నామినీ పత్రాలు సేకరిస్తారు.
ఆగస్టు 15వ తేదీ ఆధారంగా రైతు వయసును పరిగణనలోకి తీసుకుంటారు. అంటే 14 ఆగస్టు 1959 నుంచి 15 ఆగస్టు 2000 మధ్య పుట్టినవారే బీమాకు అర్హులు.
ఆధార్‌కార్డులో రైతు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉండి తేదీ లేకపోతే.. అలాంటివారికి జూలై ఒకటో తేదీని పుట్టిన రోజుగా పరిగణిస్తారు.
రైతు సమన్వయ సమితి సభ్యులను ఈ పథకంలో ఏఈవోలు భాగస్వాములు చేయాలి.
ఏఈవోలు ఇచ్చిన వివరాలను రెవెన్యూశాఖ ఇచ్చిన రికార్డులకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఏవోలు పరిశీలించాలి.
నామినీ మైనర్‌ అయితే.. రైతు సూచించిన వారి పేరు (సంరక్షకులుగా) ఇవ్వాలి. 
సేకరించిన బీమా పత్రాలన్నింటినీ వ్యవసాయ సహాయ సంచాలకుల కస్టడీలో రెండేళ్లపాటు భద్రంగా ఉంచాలి.
రైతులెవరైనా మరణిస్తే.. కుటుంబసభ్యులు పరిహారం కోసం నోడల్‌ ఏజెన్సీ ద్వారా సమాచారం ఇవ్వాలి. మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్‌ కార్డు సమర్పించాలి. ఎల్‌ఐసీ సంస్థ పది రోజుల్లోగా నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల పరిహారం సొమ్మును జమ చేస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top